రాజధాని కట్టడానికి అమరావతి పనికిరాదు : తమ్మినేని సీతారాం

-

‘శ్రీకాకుళం రాజధాని కావాలనేవారిది మరుగుజ్జు మనస్తత్వం. రాజధాని కట్టడానికి అమరావతి పనికిరాదు. అవన్నీ ఆవ భూములు. రాజధాని విషయంలో చంద్రబాబు లాజిక్కు మిస్సయ్యి, అతి తెలివితో తప్పటడుగు వేశారు. అమరావతిని ప్రపంచం మెచ్చే రాజధానిగా తీర్చిదిద్దుతామని రియల్‌ ఎస్టేట్ వ్యాపారం చేసుకునేందుకు కుట్ర చేశారు’ అని ఏపీ శాసనసభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. శ్రీకాకుళంలో జరిగిన జడ్పీ సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఇందులో విశాఖ రాజధానికి మద్దతుగా తీర్మానం చేశారు. దాన్ని హైకోర్టుకు సమర్పిస్తామని స్పీకర్‌ తెలిపారు.

సమావేశంలో శ్రీకాకుళాన్ని రాజధానిగా చేయాలని కోరిన టీడీపీ జడ్పీటీసీ సభ్యుడు పొగిరి బుచ్చిబాబుపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ రాజధానికి వ్యతిరేకంగా టీడీపీ తీర్మానం చేయగలదా అని ప్రశ్నించారు. ‘గతంలో ఎన్నో పోరాటాలు చేసిన ఉద్యమాల పురిటిగడ్డ శ్రీకాకుళం. విశాఖ రాజధాని సాధనకు అవసరమైతే మరోమారు ఉద్యమాల ఖిల్లాగా మారుతుంది. అమరావతి రైతుల పాదయాత్రను సూర్యభగవానుడు సైతం హర్షించలేదు. అందుకే వారిని వెనక్కి పంపేశాడు. రూ.15-20 వేలకోట్లు ఖర్చు చేస్తే విశాఖ అద్భుతమైన రాజధానిగా మారుతుంది. ఈ విషయమై న్యాయం చేయాలని న్యాయమూర్తులను చేతులెత్తి మొక్కుతున్నాం’ అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version