న్యూఢిల్లీ: ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వివాదాస్పద మూడు కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ మంగళవారం రైతులు చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకంగా మారుతోంది. దీంతో దేశరాజధాని ప్రాంతం మొత్తం ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోలీసుల అడ్డగింపులు, బారీకెడ్లను నెట్టేస్తూ రైతన్నలు ముందుకు సాగారు. ఢిల్లీలోని ఎర్రకోటపై జెండాలు ఎగురవేశారు. పోలీసులు, రైతుల మధ్య నెలకొన్న స్వల్పఘర్షణ నేపథ్యంలో అక్కడి వాతావరణం గందరగోళంగా మారింది.
ఈ క్రమంలోనే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందిస్తూ.. ఏ సమస్యకైనా హింస పరిష్కారం చూపదని రాహుల్ పేర్కొన్నారు. ఢిల్లీలో ప్రస్తుతం నెలకొన్న పరిస్తుతుల కారణంగా ఎవరు గాయపడ్డారనే దానితో సంబంధం లేకుండా యావత్ భారతావని బాధపడుతోందని రాహుల్ అన్నారు. దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వెంటనే కొత్త సాగు చట్టాలను వెనక్కి తీసుకోవాలని రాహుల్ కేంద్రానికి సూచించారు.
ఇక గత 60 రోజులుగా కేంద్రం తీసుకువచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు దేశరాజధాని సరిహద్దు ప్రాంతమైన సింగూ బోర్డర్‌లో ఆందోళనలు చేస్తున్నారు. ఇదివరకూ పలు మార్లు కేంద్రం, రైతుల మధ్య చర్చలు జరిగిన సఫలం కాలేదు. ఆ చట్టాలను వెనక్కి తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తూ తమ ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే నేడు దేశరాజధాని ఢిల్లీలో ట్రాక్టర్ ర్యాలీని చేపట్టారు. అయితే, ఇది పోలీసుల అడ్డగింపు, టియర్ గ్యాస్, జల ఫిరంగుల ప్రయోగంతో హింసాత్మకంగా మారింది. ఇంకా పరిస్థితులు ఉద్రిక్తంగానే ఉన్నాయి.