పంజాబ్ లో దారుణ హత్యకు గురైన కాంగ్రెస్ నేత సిద్దు మూసెవాలా కుటుంబాన్ని నేడు కాంగ్రెస్ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ పరామర్శించనున్నారు. సిద్దు హత్యకు గురైన సమయంలో రాహుల్ గాంధీ ఇండియాలో లేరు. ఈ ఘటన జరిగిన వారం తర్వాత ఆయన ఇండియాకు తిరిగి వచ్చారు. పంజాబ్ కాంగ్రెస్ అగ్ర నేతలతో కలిసి రాహుల్.. సిద్దు కుటుంబాన్ని కలుసుకుని పార్టీ తరఫున సంతాపం వ్యక్తం చేయనున్నారు.
మార్చిలో జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున మాన్సా నియోజకవర్గం నుండి మూసెవాలా పోటీ చేసి ఓడిపోయారు. మే 29న మాన్సా జిల్లాలో దారుణ హత్యకు గురయ్యారు సిద్ధూ. పంజాబ్లో 424 మంది ప్రభుత్వ భద్రతను తొలగించిన మరునాడే హత్య జరగడం రాజకీయంగా తీవ్ర వివాదానికి తెరలేపింది. సిద్దు పై రెండు నిమిషాల వ్యవధిలో 30 రౌండ్లు కాల్పులు జరిపినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.మాన్సా జిల్లాలో మంగళవారం సిద్దు అంత్యక్రియలు నిర్వహించారు. ఈ మేరకు పలువురు ప్రముఖులు ఆయన నివాసానికి వెళ్లి సంతాపం తెలియజేశారు.