ఓ వైపు కరోనా వైరస్ సృష్టించిన విపత్కర పరిస్థితుల్లో ప్రజలు అల్లాడిపోతున్న వేళ.. మన రైల్వే మరో బాదుడుకు రంగం సిద్ధం చేస్తోంది. ప్రయాణికులను పిండిపిప్పిచేసేందుకు రెడీ అవుతోంది. ఇక నుంచి టికెట్ ధరతోపాటు యూజర్‌చార్జీలను కూడా వసూలు చేయనుంది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. ప్రధానంగా ఆధునీకరిస్తున్న, రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లలో రైల్ టికెట్ ధరతో కలిపి యూజర్ చార్జీలు వసూలు చేస్తామని భారతీయ రైల్వే ప్రకటించింది. ప్రయాణికులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు ఆదాయార్జనలో భాగంగా వీటిని వసూలు చేస్తామని రైల్వే బోర్డు చైర్మన్ వీకే యాదవ్ వెల్లడించారు. అయితే.. చార్జీలు భారీగా ఉండవని యాదవ్ చెప్పారు. దేశంలోని 7 వేల రైల్వే స్టేషన్లలోని 10–15 శాతం స్టేషన్లలో వీటిని అమలు చేస్తామని ఆయన తెలిపారు.
ఒకసారి స్టేషన్ ఆధునీకరణ పూర్తయ్యాక యూజర్ చార్జీ సొమ్మును రాయితీలకు మళ్లిస్తామని, అప్పటివరకు ఈ సొమ్మును స్టేషన్ అభివృద్దికి వినియోగిస్తామని వివరించారు. రైల్వేలో ప్రైవేటు భాగస్వామ్యాన్ని అనుమతించిన వేళ టికెట్ల ధరలు పెరుగుతాయన్న ఆందోళనల మధ్య ఈ ప్రకటన రావడం గమనార్హం. ప్రస్తుతం దేశంలోని దాదాపు 50 స్టేషన్లను ఆధునీకరించాలని రైల్వే భావిస్తోంది. ఆయా స్టేషన్ల కింద ఉన్న భూములను 60 ఏళ్లపాటు వాణిజ్య అవసరాలకు లీజుకు ఇవ్వాలని రైల్వేబోర్డు ఆలోచిస్తోంది. ఇలా అభివృద్ధి చేసిన స్టేషన్ హబ్స్‌ను రైలోపోలిస్‌గా పిలుస్తారు. త్వరలో దేశ వృద్ధిలో రైల్వేల వాటా 2 శాతానికి పెరగవచ్చని నీతి అయోగ్ సీఈవో అమితాబ్ అన్నారు. స్టేషన్ల ఆధునీకరణలో జాప్యాన్ని ఇటీవల నీతీఆయోగ్ ప్రశ్నించింది. అనంతరం 50 స్టేషన్ల అభివృద్ధి ప్రణాళికల కోసం ఉన్నతాధికారులతో సాధికార గ్రూప్‌ను ఏర్పాటు చేయడం గమనార్హం.