చెన్నై నగరం వరసగా వస్తున్న అల్పపీడనాలు, వాయుగుండాలతో అతలాకుతలం అవుతోంది. గత 15 రోజుల నుంచి నగరం వర్షాలతో తడిసి ముద్దవుతోంది. ప్రస్తుతం వాయుగుండం, ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో చైన్నైతో పాటు తమిళనాడు కోస్తా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈనెల 7వ తేదీ కురిసిన కుంభవృష్టికి నగరం అతలాకుతలమైన విషయం తెలిసిందే. తాజా మళ్లీ భారీ వర్షాలు కురుస్తుండటంతో చెన్నైలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లపైకి నీరు చేరి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు కలిగించాయి. గురువారం వేకువ జామున చిరుజల్లులతో ప్రారంభమైన ఈ వర్షం ఉదయం తొమ్మిది కల్లా జడివానగా మారింది. దీంతో ఐఎండీ చెన్నై నగరానికి రెడ్ అలెర్ట్ జారీ చేసింది.
వాయుగుండం కారణంగా భారీ వర్షాలు కురిసే అవకాశం వుండటంతో చెన్నై సహా ఐదు జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. చెన్నై, తిరువళ్లూరు, వేలూరు, తిరుపత్తూరు, రాణిపేట, కాంచీపురం జిల్లాల్లో శుక్రవారం పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వు జారీ చేశారు. ఈశాన్య రుతుపవనాల ప్రభావం, వాయుగుండం కారణంగా తిరునల్వేలి, తూత్తుకుడి, తిరుప్పూరు, తెన్‌కాశి, దిండుగల్, తేని, తిరుచ్చి, కడలూరు, కన్నియాకుమారి సహా 24 జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.