ఇన్నాళ్ళు చికెన్ తింటే కరోనా వైరస్ వస్తుంది అని కొందరు తీవ్ర స్థాయిలో ప్రచారం చేసారు. దీనితో చికెన్ ధరలు భారీగా పడిపోయాయి. ఉచితంగా ఇస్తే కోళ్ళు, చికెన్ తీసుకున్న జనం… డబ్బులు పెట్టి కొనేలా ఉంటే మాత్రం ఒకటికి వంద సార్లు ఆలోచించారు. దీనితో వంద రూపాయలకు మూడు కోళ్ళు ఇచ్చే పరిస్థితి ఏర్పడింది. చికెన్ తింటే కరోనా వైరస్ రాదని… కరోనా తగ్గుతుందని సిఎం కెసిఆర్ స్వయంగా చెప్పారు.
దీనితో ఇప్పుడు చికెన్ కి డిమాండ్ పెరిగింది. చికెన్ కొనుగోలు చేయడానికి జనం ఎక్కువగా ఎగబడుతున్నారు. హైదరాబాద్‌లో కిలో చికెన్ ధర రూ.240కి చేరింది. కొన్ని చోట్ల రూ.200 నుంచి రూ.220 మధ్య అమ్మారు. చేపల ధర కూడా భారీగా పెరిగింది. కిలో రూ.110 – రూ.120 మధ్య ఉన్న రగులు, బొచ్చెల ధర రూ.180 – రూ.200కి చేరుకుంది. అయితే కోళ్ళు, చేపల కొరత ఎక్కువగా ఉంది.
మొన్నీ మధ్య కరోనా వైరస్ కారణంగా చాలా మంది కోళ్ళు కాల్చేశారు. బ్రతికి ఉన్న కోళ్ళు తగలబెట్టారు. ఇప్పుడు పిల్లలు ఉన్నాయి. ఇప్పుడు మరింత డిమాండ్ పెరగడంతో… ధరలు కూడా పెరుగుతున్నాయి. ఉత్పత్తి చాలా తక్కువగా ఉంది. ఇప్పుడు షెడ్ లో కోళ్ళు ఉన్న వాడు మాత్రం అద్రుష్ట వంతుడు అంటున్నారు రైతులు. తెలంగాణాలో పౌల్ట్రీ పరిశ్రమ ఎక్కువగా విస్తరించి ఉంది. ఆదివారం రూ.800కి మటన్ చేరుకుంది.