మునావర్ ఫారూఖీ షో అంశం చిలికిచిలికి గాలి వానగా మారుతోంది. బీజేపీ నేతలు మునావర్ షోకు పర్మిషన్ ఇవ్వవద్దని అంటున్నారు. స్టాండప్ కమేడియన్ అయిన మునావర్ ఫరూఖీ షోలను దేశంలో కొన్ని రాష్ట్రాలు బ్యాన్ చేశాయి. మునావర్ షోకు తెలంగాణలో కూడా పర్మిషన్ ఇవ్వకూడదని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, డీజీపీ మహేందర్ రెడ్డికి లేఖ రాశారు. ఈ షోకు పర్మిషన్ ఇస్తే శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని లేఖలో పేర్కొన్నారు.
స్టాండప్ కమెడియన్ గా ఉన్న మునావర్ ఫరూఖీ గతంలో హిందూ దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల బెంగళూర్ లో ఓ షో చేయాల్సి ఉన్నా… చివరి నిమిషంలో కర్నాటక ప్రభుత్వం రద్దు చేసింది. తాజాగా హైదరాబాద్లో వచ్చే నెలలో మునావర్ షో జరగాల్సి ఉంది. ఇదే కాకుండా రిపోర్టర్ అర్నబ్ గోస్వామి తో పాటు గుజరాత్ అల్లర్లపై కూడా వివాదస్పద వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఇక్కడ షో చేస్తే హిందువుల్లో తీవ్ర వ్యతిరేఖత ఉంది. దీంతో శాంతి భద్రతల సమస్యలు వస్తాయని రాజా సింగ్ లేఖలో డీజీపీకి తెలిపారు.
ఈ అంశంపై ఇప్పటికే మునావర్ షోకు సంబంధించి ఓ వీడియోను రాజాసింగ్ విడుదల చేశారు. అందులో మునావర్ ను హైదరాబాద్ లోకి అడుగు పెట్టనీయమని తెలిపారు. మునావర్ షోతో ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో అలజడి రేగుతుందని హెచ్చరించారు. అడ్డుకోవడానికి ఎందాకైనా వెళతాం .. అని వార్నింగ్ ఇచ్చారు. దీనిపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా వార్నింగ్ ఇచ్చారు. మునావర్ షోను అడ్డుకోవాలని బీజేవైఎం కార్యకర్తలకు పిలుపునిచ్చారు.