నాపై అక్రమంగా పీడీ చట్టం ప్రయోగించారు : రాజాసింగ్

-

తనపై పోలీసులు అక్రమంగా పీడీ చట్టం ప్రయోగించారని అడ్వయిజరీ బోర్డు ఎదుట గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ వాదనలు వినిపించారు. ఆయనను మంగళహాట్ పోలీసులు పీడీ యాక్ట్‌ కింద అరెస్ట్‌ చేసి చర్లపల్లి జైలుకు తరలించిన విషయం తెలిసిందే. ఆయన నెల రోజులకు పైగా జైలులో ఉన్నారు. బేగంపేట గ్రీన్‌లాండ్‌ అతిథిగృహంలో పీడీ యాక్ట్‌ అడ్వయిజరీ బోర్డు సమావేశమై ఈ కేసు విచారణ చేపట్టింది.

విచారణకు ఎమ్మెల్యే ప్రత్యక్షంగా హాజరు కావాల్సి ఉండగా భద్రత కారణాల రీత్యా చర్లపల్లి కేంద్ర కారాగారం నుంచి దృశ్యమాధ్యమం ద్వారా పాల్గొనే అవకాశం కల్పించారు. రాజాసింగ్‌ సతీమణి ఉషాబాయి, ఆయన న్యాయవాది కరుణాసాగర్‌ విచారణకు ప్రత్యక్షంగా హాజరయ్యారు. పోలీసులు తన భర్తపై మోపిన అభియోగాలు అవాస్తవమని, అక్రమమని ఉషాబాయి విన్నవించారు. రాజాసింగ్‌పై పీడీ యాక్ట్‌ నమోదుకు కారణాలను బోర్డు సభ్యులకు మంగళహాట్‌ పోలీసులు తెలియజేశారు.

ఇరుపక్షాల వాదనలను విన్న బోర్డు తీర్పును రిజర్వు చేసింది. 10 రోజుల తర్వాత నిర్ణయాన్ని వెల్లడించే అవకాశం ఉందని అధికారిక వర్గాలు తెలిపాయి. పోలీసులు పీడీ యాక్ట్‌ మోపడం సరైందేనని తీర్పు వెలువడితే రాజాసింగ్‌ ఏడాది పాటు జైలులో ఉండాల్సి వస్తుంది. అయితే ఆ నిర్ణయాన్ని హైకోర్టులో సవాల్‌ చేసి.. బెయిల్‌ పొందే అవకాశం ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version