రాజస్థాన్ కాంగ్రెస్ లో సంక్షోభం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో సంక్షోభ నివారణకు “శాంతి దూత”గా రంగంలోకి దిగారు కమల్ నాధ్. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ లమధ్య విభేదాలు ప్రమాద దశకు చేరాయి. మరి కొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు రానున్న నేపధ్యంలో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం.
అయితే.. తిరుగుబాటు నేత సచిన్ పైలట్, ఏఐసిసి సంస్థాగత వ్యవహారాల ఇంచార్జ్ జనరల్ సెక్రటరీ కేసి వేణుగోపాల్ ను కలిసి పరిష్కార మార్గాలు పై చర్చించారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మధ్య ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాధ్. తొలుత గెహ్లాట్ ను సమర్ధిస్తూ రెండు ప్రకటనలు చేసిన కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం, తాజాగా మధ్యేమార్గం అవలంబించాలని నిర్ణయం తీసుకుంది.
రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీ లో రెండు వర్గాల మధ్య సఖ్యత, శాంతి నెలకొనేలా చూడాలని కమల్ నాధ్ ను రంగంలోకి దించింది. కమల్ నాధ్ కు, ఏఐసిసి సంస్థాగత వ్యవహారాల ఇంచార్జ్ జనరల్ సెక్రటరీ కేసి
వేణుగోపాల్ కు చాలా వివరంగా తన అభిప్రాయాలను, ఫిర్యాదులను తెలిపారు సచిన్ పైలట్. ప్రజా ప్రయోజనాలను దృష్టి లో పెట్టుకునే దీక్ష చేశానని, “పార్టీ వ్యతిరేక కార్యాకలాపాలు” కావని స్పష్టంగా “శాంతి దూత” గా వచ్చిన కమల్ నాధ్ కు తెలిపారు సచిన్ పైలట్. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.