అది హైదరాబాద్ శివారు నియోజకవర్గం. ఒక పక్క అంతర్జాతీయ విమానాశ్రయం. మరోపక్క ఔటర్ రింగ్ రోడ్డు… జాతీయస్థాయి సంస్థలు. అన్నీ ఉన్నా ఆ నియోజకవర్గంలోని ఐదు డివిజన్లు మాత్రం అభివృద్ధికి నోచుకోలేదు. ఫామ్‌హౌస్‌లు .. పూరిగుడిసెల కలబోతగా ఉన్న ఆ నియోజకవర్గమే.. రాజేంద్రనగర్. గ్రేటర్లో ఇక్కడ రాజకీయం ఎలా ఉంది..
నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ఏర్పాటైన రాజేంద్రనగర్ అసెంబ్లీ సెగ్మెంట్‌లో గండిపేట్, శంషాబాద్ మండలాలున్నాయి. శంషాబాద్‌లో అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు జంట నగరాల ప్రజలకు తాగునీరందించే హిమాయత్‌సాగర్, గండిపేట జలాశయాలు ఈ నియోజకవర్గం పరిధిలోనే ఉన్నాయి. ఔటర్ రింగ్‌రోడ్, పీవీ నర్సింహారావు ఎక్స్‌ప్రెస్ వే ఇక్కడే కనిపిస్తాయి. అనేక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు నిలయం ఈ అసెంబ్లీ సెగ్మెంట్. కాటేదాన్, గగన్‌పహాడ్, సాతంరాయి వంటి పారిశ్రామికవాడలూ ఉన్నాయి.పారిశ్రామికవాడలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు ఎక్కువగా ఉండటంతో దేశంలోని అన్ని రాష్ర్టాలకు చెందిన ప్రజలు నియోజకవర్గంలో నివాసముంటున్నారు. ముస్లీం, బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల ప్రజలు ఎక్కువగా కనిపిస్తారు.
రాజేంద్రనగర్ అసెంబ్లీ సెగ్మెంట్‌లోని ఐదు డివిజన్లలో… రాజకీయం రసవత్తరంగా ఉంది. గత ఎన్నికల్లో మూడు డివిజన్లలో టీఆర్‌ఎస్ గెలిచింది. మిగిలిన రెండు చోట్ల మజ్లీస్ పార్టీ విజయం సాధించింది. ఈసారి.. ఇక్కడ టీఆర్‌ఎస్, బీజేపీ, ఎంఐఎం పార్టీల మధ్య ప్రధాన పోరు నెలకొని ఉంది. మైలార్‌దేవ్ పల్లిలో గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్ నుంచి గెలిచిన..తోకల శ్రీనివాసరావు రెడ్డి ఈసారి బీజేపీలో చేరి అపార్టీ నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు .దీంతో టీఆర్‌ఎస్ తరపున ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తన సోదరుడిని బరిలో నిలిపారు.
ఇక డివిజన్ల వారీగా పరిశీలిస్తే.. రాజేంద్రనగర్ డివిజన్‌లో గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్ గెలిచింది. కార్పొరేటర్ శ్రీలత భర్త మహాత్మ, అతని సోదరుడు దయానంద్‌ల మధ్య రెండేళ్లుగా మాటలు లేవు. ఐదేళ్ల క్రితం దయానంద్ సహకారంతో మహాత్మ భార్య శ్రీలత కార్పొరేటర్‌గా గెలిచారు. తరువాత తలెత్తిన విభేదాలు.. పంచాయతీలు..పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుల వరకు వెళ్లాయి. అయితే.. మళ్లీ ఎన్నికలు రావడంతో.. కుటుంబకలహాలు మరిచి అన్నదమ్ములిద్దరూ ఒక్కటయ్యారు.
అత్తాపూర్ డివిజన్‌లో టీఆర్ఎస్ అభ్యర్థిగా మాధవి, బీజేపీ నుంచి సంగీత, కాంగ్రెస్ నుంచి వాసవి పోటీ చేస్తున్నారు. ఈ మూడు పార్టీల మధ్యే ప్రధానపోటీ నెలకొంది. ఈ డివిజన్‌లో ఏమాత్రం వర్షం కురిసినా రోడ్లు చెరువులను తలపిస్తాయి. అత్తాపూర్ – కిషన్ బాగ్ ప్రధాన రహదారిపై చెత్తాచెదారం పేరుకుపోయి ఆ ప్రాంతమంతా దుర్గందభరితంగా మారింది. మైలార్‌దేవ్‌పల్లిలో గ్రామీణ వాతావరణం ఎక్కువగా కనిపిస్తుంది. గ్రేటర్‌లోనే అత్యధిక ఓటర్లున్న డివిజన్ కావడంతో అందరి దృష్టి నెలకొంది. ఈ డివిజన్ ఏర్పడిన నాటి నుంచి టిడిపి కంచుకోటగా ఉంది. అయితే తెలంగాణ ఆవిర్భవించాక టీఆర్‌ఎస్ ఇక్కడ పాగావేసింది. ఈ ఎన్నికల్లో మాత్రం టిఆర్ఎస్ ను ఓడించాలనే లక్ష్యంతోనే అన్ని పార్టీలు వ్యూహరచన చేస్తున్నాయి. అయితే ఈ స్థానాన్ని ఎమ్మెల్యే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇది మూసీ పరివాహక ప్రాంతం కావడంతో గతనెలలో కురిసిన వర్షాలకు భారీగా ఆస్తినష్టం, ప్రాణనష్టం జరిగింది.
ఇక సులేమాన్ నగర్, శాస్త్రీపురంలో ముస్లీం మైనార్టీలు ఎక్కువ. అందుకే గత ఎన్నికల్లో ఈరెండు డివిజన్లను మజ్లీస్ దక్కించుకుంది. ఇక్కడ బీజేపీ, ఎంఐఎం మధ్య పోటీ ఉంది. శాస్త్రీపురంలో… ఎంఐఎంతో పాటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కూడా మైనార్టీ వర్గానికి చెందినవారే. దీంతో ఓట్లు చీలి..బీజేపీకి లాభం కలిగే అవకాశంలేకపోలేదు.
మొత్తానికి రాజేంద్రనగర్ నియోజకవర్గం శివార్లలో ఉన్నప్పటికీ, ఇక్కడ కూడా మిగిలిన ప్రాంతాల్లో మాదిరిగానే సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. గండిపేట్ పక్కనే ఉన్న చాలా గ్రామాలకు తాగునీటి సౌకర్యంలేదు. ఇక డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో.. మురుగునీరంతా చెరువుల్లో చేరుతోంది. కాటేదాన్ పారిశ్రామికవాడ వల్ల కాలుష్య ఇబ్బందులు వేధిస్తున్నాయి. మరి గత ఎన్నికల్లో ఈ అసెంబ్లీ సెగ్మెంట్‌లో ఖాతా తెరవని బీజేపీ ఇక్కడి డివజన్లను దక్కించుకుంటుందా… టీఆర్‌ఎస్ తన పట్టును నిలుపుకుంటుందా.. అనేది చూడాలి.