రాజకీయాలపై కసరత్తు మొదలెట్టిన తలైవా

-

ఎట్టకేలకు సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ పొలిటికల్‌ ఎంట్రీ ఖరారైపోయింది. మరి రాజకీయాల్లో.. రజనీ స్టయిల్‌ ఎలా ఉండబోతోంది? ఎవరినీ తిట్టను.. ద్వేషించను.. అంటున్న సూపర్‌స్టార్‌.. పాలిటిక్స్‌లో కొత్త ట్రెండ్‌ సృష్టిస్తాడా? అసలే రచ్చరచ్చగా ఉండే అరవ రివేంజ్‌ పాలిటిక్స్‌ను..తలైవా తట్టుకుని నిలబడగలడా? అభిమానుల్లోనే కాదు.. సగటు ప్రేక్షకుడిలోనూ ఇప్పుడివే సందేహాలు కలుగుతున్నాయి.

కొత్త సంవత్సరంలో రాజకీయాల్లో ఎంట్రీ ఇస్తున్నట్టు సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ ప్రకటించడంతో.. ఆయన అభిమానులు ఆనందంలో మునిగితేలుతున్నారు. ఎన్నాళ్లో వేచిన ఉదయం.. అన్నట్టుగా సంబరాలు చేసుకుంటున్నారు. అయితే, లేట్‌గా నిర్ణయం తీసుకున్నా.. పార్టీని మాత్రం లేటెస్ట్‌గా తీసుకురావాలనుకుంటున్నాడు రజనీ. తమిళ రాజకీయాల్ని మార్చేస్తానని ప్రకటించిన రజనీ.. ఆ దిశగానే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. రెగ్యులర్‌ పాలిటిక్స్‌కు భిన్నంగా తన వైఖరి ఉండబోతోందని కూడా ప్రకటించాడు.

సినిమాల్లో తనకంటూ డిఫరెంట్‌ స్టయిల్‌ను క్రియేట్‌ చేసుకున్న రజనీ… పాలిటిక్స్‌లో ఎలా వ్యవహరించబోతున్నారనేది ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. ఆ దిశగా రజనీ ఇప్పటికే కసరత్తు మొదలెట్టారు. తన అనుచరులతో సమావేశం నిర్వహించి.. పార్టీ విధివిధానాలపై చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. రీల్‌ లైఫ్‌లోనే కాదు.. రియల్‌ లైఫ్‌లోనూ ట్రెండ్‌ సృష్టించేలా ఉండేవిధంగా ప్లాన్‌ చేస్తున్నట్టు తెలుస్తోంది.

ఆ పైవాడు శాసిస్తాడు.. ఇక్కడ రజనీ పాటిస్తాడు సినిమాల్లోనే కాదు.. రాజకీయాల్లోనూ ఇదే పంథాతో ముందుకు సాగేందుకు సిద్ధమవుతున్నారు రజనీ. ప్రజల క్షేమమే ధ్యేయంగా.. ఆధ్యాత్మిక రాజకీయాలు చేయాలనుకుంటున్నారట. హేట్‌ పాలిటిక్స్‌ను ఏమాత్రం సహించేది లేదంటున్నారు రజనీకాంత్‌.. ఎవర్నీ తిట్టబోం.. ఎవర్నీ ద్వేషించబోం.. అనవసరంగా ఎవరినీ నిందించబోం.. రాజకీయాల్లో రజనీ నినాదం ఇదే స్టయిల్‌లో ఉండబోతోందని తెలుస్తోంది.

అసలే తమిళ పాలిటిక్స్‌ ప్రతీకారేచ్చతో సాగుతుంటాయి. అధికారంలోకి రాగానే.. ప్రత్యర్థులపై కక్ష తీర్చుకోవడం.. ఒకరినొకరు రోడ్డున పడేసుకోవడం.. అరవ రాజకీయాల్లో కామన్‌. గతంలో కరుణానిధి హయాంలో జయలలితను… జయలలిత జమానాలో కరుణానిధిని అరెస్ట్‌ చేయించారు. డీఎంకే, అన్నాడీఎంకేల మధ్య కొన్నేళ్లుగా ఇదే తరహా పాలిటిక్స్‌ సాగుతున్నాయి. అలాంటి బురద రాజకీయాల్లో తలైవా .. తట్టుకుని నిలబడ గలడా అన్నదే ఇప్పుడు మిలియన్‌ డాలర్ల ప్రశ్న.

సినిమాల పరంగా రజనీకాంత్‌ ఫాలోయింగ్‌ను కాదనలేం. కానీ, రాజకీయంగా అది పనికొస్తుందా? అన్నదే ఇక్కడ అనుమానం. ప్రస్తుత పరిస్థితుల్లో.. అందులోనూ ఈ లేట్‌ వయసులో.. తాను అనుకుంటున్న ట్రెండ్‌ సృష్టించగలడా? అన్న సందేహాలు రాక మానవు. అంతేకాదు, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు మూడు, నాలుగు నెలలకు మించి సమయం లేదు. ఈ షార్ట్‌టైమ్‌లో.. రజనీకాంత్‌ ఏమాత్రం ప్రభావం చూపగలరో చూడాలి. అసలు రజనీ అనుకుంటున్న సూపర్‌ పాలిటిక్స్‌.. అరవ రాష్ట్రంలో ప్రాక్టికల్‌గా వర్కవుట్‌ అవుతాయా? లేదా? అనేది తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news