బీజేపీ ప్రభుత్వం ఎప్పటి నుంచో కలలు కంటున్న ట్రిపుల్ తలాక్ బిల్లుకు ఎట్టకేలకు ఆమోదం లభించింది. మంగళవారం సాయంత్రం ట్రిపుల్ తలాక్ బిల్లును రాజ్యసభ ఆమోదించింది.
బీజేపీ ప్రభుత్వం ఎప్పటి నుంచో కలలు కంటున్న ట్రిపుల్ తలాక్ బిల్లుకు ఎట్టకేలకు ఆమోదం లభించింది. మంగళవారం సాయంత్రం ట్రిపుల్ తలాక్ బిల్లును రాజ్యసభ ఆమోదించింది. ఈ బిల్లుకు అనుకూలంగా 99, వ్యతిరేకంగా 84 మంది ఓటు వేశారు. దీంతో బిల్లుకు ఆమోదం లభించింది. కాగా జూలై 25వ తేదీన ఇప్పటికే లోక్‌సభలో ట్రిపుల్ తలాక్ బిల్లుకు ఆమోదం లభించగా.. ఇప్పుడు రాజ్యసభ కూడా ఈ బిల్లుకు ఆమోదం తెలిపింది.
కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఇవాళ రాజ్యసభలో ట్రిపుల్ తలాక్ బిల్లును ప్రవేశపెట్టారు. కాగా బిల్లుకు రాజ్యసభ కూడా ఆమోదముద్ర వేయడంతో ఉభయ సభల్లోనూ బిల్లు ఆమోదం పొందినట్లయింది. కాగా ఈ బిల్లుకు గాను రాజ్యసభలో చైర్మన్ వెంకయ్య నాయుడు స్లిప్పుల ద్వారా ఓటింగ్ చేపట్టగా సభకు హాజరైన సభ్యులందరికీ ఈ స్లిప్పులను అందజేశారు.
అయితే ట్రిపుల్ తలాక్ బిల్లుకు వ్యతిరేకంగా కాంగ్రెస్, ఆర్‌జేడీ, వైసీపీ, టీఎంసీ, బీఎస్‌పీ, వామ పక్షాలు ఓటేశాయి. టీఆర్‌ఎస్, టీడీపీ, జేడీయూలు ఓటింగ్‌కు దూరంగా నిలిచాయి. ఇక డీఎంకే సభ్యులు బిల్లును వ్యతిరేకిస్తూ వాకౌట్ చేయగా, ఈ బిల్లుపై విపక్షాలు చేపట్టాలని కోరిన సవరణలు వీగిపోయాయి. అలాగే బిల్లును సెలెక్ట్ చేసి ప్యానెల్‌కు పంపాలన్న డిమాండ్‌ను కూడా తిరస్కరించారు. ఇక ఈ బిల్లుకు ప్రస్తుతం ఉభయ సభల ఆమోదం లభించడంతో త్వరలోనే దీన్ని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వద్దకు పంపనున్నారు. ఆయన ఈ బిల్లును ఆమోదిస్తే ఈ బిల్లు చట్టరూపం దాలుస్తుంది..!