కేంద్ర ప్రభుత్వం ఆర్మీలో నాలుగేళ్ల ఉద్యోగాలకు గాను ప్రకటించిన అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో యువత నిన్న పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. అది కాస్తా హింసాత్మక రూపు సంతరించుకోవడంతో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో వరంగల్ జిల్లా యువకుడు రాకేష్ ప్రాణాలు కోల్పోయాడు. నేడు రాకేష్‌కు ఆయన స్వగ్రామమైన నర్సంపేటలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ఈ నేపథ్యంలో అంతకంటే ముందు రాకేష్ మృతదేహంతో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించేందుకు టీఆర్ఎస్ శ్రేణులు సిద్ధమయ్యాయి. అలాగే, రాకేష్ మృతిని నిరసిస్తూ టీఆర్ఎస్ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి నేడు నర్సంపేట నియోజకవర్గం బంద్‌కు పిలుపునిచ్చారు. మరోవైపు, వరంగల్ ఎంజీఎంలో ఉన్న రాకేష్ మృతదేహాన్ని నేడు నర్సంపేట తరలించనున్న నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యగా ఆసుపత్రి వద్ద పోలీసులు భారీగా మోహరించారు.