ఎల్. రమణ…తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడు. దశాబ్దాల పాటు టీడీపీలో కీలక పాత్ర పోషించిన రమణ ఇప్పుడు తన దారి తాను చూసుకునే పనిలో పడ్డారు. ఎందుకంటే తెలంగాణలో టీడీపీ కనుమరుగై స్థితికి వచ్చేసింది. దీంతో పార్టీని నడిపించడం కష్టమని భావిస్తున్న రమణ గులాబీ గూటికి చేరేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది. అలాగే రమణకు టీఆర్ఎస్ అధిష్టానం ఎమ్మెల్సీ ఇవ్వడానికి కూడా సిద్ధమైందని వార్తలు వస్తున్నాయి. ఇక రేపో,మాపో రమణ టీఆర్ఎస్‌లో చేరడం ఖాయమని అంటున్నారు.
అదే సమయంలో మరో సీనియర్ నేత పెద్దిరెడ్డి కూడా టీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకుంటారని ప్రచారం జరుగుతుంది. ఈయన కూడా చాలా ఏళ్ళు టీడీపీలో పని చేసి ఈ మధ్యే బీజేపీలోకి వెళ్లారు. కానీ ఈటల ఎంట్రీతో పెద్దిరెడ్డి సైడ్ అవ్వాలని అనుకుంటున్నారని తెలుస్తోంది. గతంలో హుజూరాబాద్‌లో రెండుసార్లు గెలిచిన పెద్దిరెడ్డికి కూడా బాగానే పట్టు ఉందని టీఆర్ఎస్ భావిస్తోంది.
అందుకే పెద్దిరెడ్డిని పార్టీలోకి తీసుకోవాలని చూస్తుంది. ఈయన్ని పార్టీలో తీసుకుని టికెట్ ఇస్తుందో లేక నాయకుడుగా ఉంచుతారో చూడాలి. కానీ రమణ, పెద్దిరెడ్డిలకు మునుపటి బలం లేదనే చెప్పొచ్చు. గత పార్లమెంట్ ఎన్నికల్లో అలాగే నిజామాబాద్‌లో కవితని గెలిపించాలని సీనియర్ నాయకులు మండవ వెంకటేశ్వరరావు, మాజీ స్పీకర్ సురేష్ రెడ్డిలని కేసీఆర్, టీఆర్ఎస్‌లోకి తీసుకొచ్చిన కవిత గెలవలేదు. ఇప్పుడు రమణ, పెద్దిరెడ్డిలని తీసుకోవడం వల్ల హుజూరాబాద్‌లో టీఆర్ఎస్‌కు ఎంత బెన్‌ఫిట్ ఉంటుందో చూడాలి.