కరోనా నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) మార్చి నుంచి ఆగస్టు వరకు రెండు దశల్లో ఈఎంఐ మారటోరియం సదుపాయం కల్పించింది. అయితే ఆగస్టు తరువాత ఆ సదుపాయాన్ని పొడిగించలేదు. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో తొలి విడతగా, జూన్, జూలై, ఆగస్టు నెలల్లో రెండో విడత మారటోరియం సదుపాయం కల్పించారు. కానీ సెప్టెంబర్ సమీపించినా తదుపరి ఈఎంఐ మారటోరియంకు ఆర్‌బీఐ అవకాశం కల్పించలేదు. అయితే అందుకు పలు కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది.
మార్చి నుంచి మే వరకు ఇచ్చిన మారటోరియం నిజానికి చాలా మందికి ఉపయోగపడింది. ఆ సమయంలో దేశం మొత్తం లాక్‌డౌన్‌లో ఉంది. ఎవరికీ పనిలేదు. అందువల్ల చాలా మంది మారటోరియంను ఉపయోగించుకున్నారు. అయితే మే నెల నుంచి దాదాపుగా ఆంక్షలను సడలిస్తూ వచ్చారు. దీంతో యథావిధిగా కార్యకలాపాలు కూడా మొదలయ్యాయి. కానీ కొందరు మాత్రం మారటోరియం అవసరం లేకున్నా ఆ సదుపాయం తీసుకున్నారని బ్యాంకులు ఆర్‌బీఐకి చెప్పాయి. ముఖ్యంగా జూన్ నుంచి ఆగస్టు వరకు ఇచ్చిన రెండో విడతలో అధిక శాతం మంది ఈ విధంగా చేసినట్లు బ్యాంకులు తెలిపాయి.
ఇక మారటోరియం సదుపాయాన్ని పొడిగిస్తూ వెళితే అది ఈఎంఐ చెల్లింపుదారుల క్రెడిట్ బిహేవియర్‌పై ప్రభావం చూపిస్తుందని, ఎక్కువ మంది లోన్లు చెల్లించని వారిగా మిగిలిపోతారని, అది తమకు నష్టం కలిగిస్తుందని, కనుక ఆగస్టు తరువాత మారటోరియం సదుపాయాన్ని పొడిగించకూడదని బ్యాంకులు ఆర్‌బీఐని కోరినట్లు సమాచారం. అందుకనే ఆర్‌బీఐ తదుపరి మారటోరియంను ప్రకటించలేదు. అయితే లోన్లు చెల్లించని ఒక్కో కస్టమర్‌ను బ్యాంకులు ప్రత్యేకంగా కలిసి వారి పరిస్థితులకు అనుగుణంగా ఏదైనా నిర్ణయాన్ని తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనిపై బ్యాంకులు ఆర్‌బీఐతో చర్చిస్తున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ వివరాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.