రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్.. అసలు సిసలైన టీ 20 రుచిని అందించింది. ఈ మ్యాచ్ లో ఫస్ట్ బంతి నుంచి చివరి బంతి వరకు బౌండరీల వర్షం కురిసింది. ఇరు జట్ల ప్లేయర్లు తమ బ్యాట్లను ఝలిపించారు. దీంతో రెండు జట్లు కూడా భారీ స్కోరును చేశాయి. చివరికి బెంగళూర్ నిర్దేశించిన భారీ లక్ష్యం 206ను పంజాబ్… మరో ఓవర్ మిగిలి ఉండగానే ఛేదించింది. దీంతో బెంగళూర్ పై పంజాబ్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
ఓపెనర్లు మయాంక్ అగర్వాల్ ( 24 బంతుల్లో 32), శిఖర్ ధావన్ (29 బంతుల్లో 43), రాజపక్స ( 22 బంతుల్లో 43 ), లివింగ్ స్టోన్ (10 బంతుల్లో 19) అందరూ మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. చివర్లో షారుఖ్ ఖాన్ (24) తో పాటు ఓడియన్ స్మిత్ కేవలం 8 బంతుల్లోనే 25 పరుగులు చేశాడు.
బ్యాక్ టూ బ్యాక్ సిక్స్ లను బాదాడు. 3 సిక్స్ లు ఒక్క ఫోర్ తో చివర్లో.. బెంగళూర్ బౌలర్లకు చుక్కులు చూపించాడు. వీరి దాటికి భారీ స్కోర్ కూడా చిన్నబోయింది. పంజాబ్ ఇంత భారీ స్కోర్ ను ఛేదించడం ఇది మూడో సారి. గతంలో కూడా 206 పరుగుల లక్ష్యాన్ని రెండు సార్లు ఛేదించింది. కాగ మ్యాచ్ లో ఓడియన్ స్మిత్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.