కరీంనగర్ లో మరో ఉపఎన్నిక ?

-

ఆలు లేదు చూలు లేదు కొడుకుపేరు సోమలింగం అన్నట్టు ఉంది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పొలిటికల్ సీన్. ఇప్పుడు వేములవాడలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఉపఎన్నిక వస్తుందన్న చర్చ జోరందుకుంది. ఇంతకీ వేములవాడకు ఉపఎన్నిక ఎందుకు వస్తుంది?

చెన్నమనేని రమేష్‌ వేములవాడ ఎమ్మెల్యే. మొదటి నుంచి పౌరసత్వం వివాదంలో నలుగుతున్నారు రమేష్‌. ఆయనకు భారత పౌరసత్వం లేదని.. జర్మనీ పౌరసత్వం ఉందని హైకోర్టు, సుప్రీంకోర్టుల్లోనూ విచారణ జరిగింది. ఈ క్రమంలో రమేష్‌ ఏ దేశ పౌరుడన్నది ఈ నెల 16న హైకోర్టు తీర్పు చెప్పబోతోంది. దీంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఒకవేళ రమేష్‌కు జర్మన్‌ పౌరసత్వం ఉందని తేలితే మాత్రం వేమువాడలో ఉపఎన్నిక ఖాయం. అందుకే ఇక్కడి రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.

చెన్నమనేని రమేష్‌ రెండోసారి ఎమ్మెల్యే అయినప్పటికీ పౌరసత్వం వివాదం ఆయన్ని వెన్నాడుతూనే ఉంది. ఆయనకు సంబంధించిన వివరాలను కేంద్ర హోంశాఖ కోర్టుకు సమర్పించింది కూడా. గత ఏడేది డిసెంబర్‌లో చెన్నయ్‌ నుంచి ఆయన జర్మనీ వెళ్లింది కూడా ఆ దేశానికి చెందిన పాస్‌పోర్టుపైనే అన్నది కేంద్రం చెప్పే మాట. ఇదే విషయం హోంశాఖ కోర్టుకు వెల్లడించింది. ఒకవైపు జర్మన్‌ పౌరసత్వం కొనసాగిస్తూనే మరోవైపు భారత పాస్‌పోర్టును కూడా కలిగి ఉన్నారన్నది రమేష్‌పై ఉన్న ఇంకో అభియోగం. అందుకే 16న హైకోర్టు వెల్లడించే తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

ఇంకోవైపు పార్టీలు కూడా ఎందుకైనా మంచిదని ఉపఎన్నిక సన్నాహాలు మొదలు పెట్టేశాయి. ఇప్పటి నుంచి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. రమేష్‌ పౌరసత్వంపై ప్రారంభం నుంచి కోర్టులో కేసులు వేసి కొట్లాడుతున్న ఆది శ్రీనివాస్‌ సైతం ఎమ్మెల్యే కావాలని ఆశిస్తున్నారు. ఈ దఫా ఆ కోరిక తీరబోతుందని సన్నిహితుల దగ్గర కామెంట్స్‌ చేస్తున్నారట. అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ అయితే ఉప ఎన్నికల్లో పోటీ చేసే ముగ్గురు పేర్లను పరిశీలిస్తున్నట్టు చెబుతున్నారు. దీంతో ఒక్కసారిగా ఇతర పక్షాలు జోరు పెంచాయి.

దుబ్బాక ఉపఎన్నికలో విజయం తర్వాత ఊపు మీద ఉన్న బీజేపీ సైతం వేములవాడలో గ్రౌండ్‌ వర్క్‌ మొదలుపెట్టేసింది. అభ్యర్థుల వేటతోపాటు.. వేములవాడలో పాగా వేసేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై దృష్టిపెట్టారట. నియోజకవర్గంలోని పార్టీ నేతల అభిప్రాయం సేకరిస్తున్నట్టు సమాచారం. కాంగ్రెస్‌ పార్టీ సైతం ఈ దిశగా ఫోకస్‌ పెట్టినట్టు చెవులు కొరుక్కుంటున్నారు. ఇప్పటికే ప్రధాన పార్టీలు నాగార్జునసాగర్‌కు జరగబోయే ఉప ఎన్నిక కసరత్తులో ఉన్నాయి. పనిలో పనిగా వేములవాడ విషయంలోనూ తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిదనే అభిప్రాయంలో ఉన్నాయట.

ప్రస్తుతం వేములవాడ జనాలతోపాటు పార్టీల నాయకులంతా డిసెంబర్‌ 16న ఏం జరగబోతుందా అని ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. కోర్టులో రమేష్‌కు అనుకూలంగా తీర్పు వచ్చినా.. వ్యతిరేకంగా జడ్జిమెంట్‌ ఉన్నా.. సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం ఉంది. అయితే రమేష్‌కు జర్మనీ పౌరసత్వం ఉందని హైకోర్టు స్పష్టం చేస్తే మాత్రం వేడి రాజుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version