ర‌ఘురామ కాన్ఫిడెన్స్‌కు అసలు కార‌ణం ఇదే…!

-

వైసీపీ తర‌పున నరసాపురం ఎంపీగా గెలిచిన రఘురామకృష్ణంరాజు..గత కొంతకాలంగా సొంత పార్టీకే ప్రత్యర్ధిగా మారిన విషయం తెలిసిందే. ప్రతిరోజూ మీడియా సమావేశం పెట్టడం జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం చేస్తున్నారు. ఇక రాజుగారి విమర్శలకు వైసీపీ నేతలకు బాగా మండుతుంది. అందుకే ఆయన్ని దమ్ముంటే రాజీనామా చేసి గెలువు అని ఎప్పటికప్పుడు సవాల్ విసురుతూనే ఉన్నారు. ఇటు రాజు గారు కూడా జగన్ ఇమేజ్‌తో పాటు, తన సొంత ఇమేజ్‌తో గెలిచానని, తాను రాజీనామా చేయనని పలుమార్లు చెప్పారు. ఈ క్రమంలోనే తాజాగా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి..టీడీపీకి సపోర్ట్‌గా మాట్లాడటం కాదు..దమ్ము ధైర్యం ఉంటే ఎంపీ పదవికి రాజీనామా చేసి, మరో పార్టీ నుంచి పోటీ చేసి గెలవాలని ఛాలెంజ్ చేశారు.

ఇక ఈ ఛాలెంజ్‌కు ఎంపీ కూడా గట్టిగానే స్పందించారు. తాను పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో నెగ్గితే… అమరావతినే రాజధానిగా కొనసాగిస్తానని సీఎం రాత పూర్వకంగా హామీ ఇచ్చేందుకు సిద్ధమైతే, రాజీనామా చేస్తానని ప్రతి సవాల్  విసిరారు. అయితే రాజుగారి సవాల్‌పై వైసీపీ నేతల స్పందన ఎలా ఉంటుందనే విషయం పక్కనబెడితే, ఇంతకాలం పదవికి రాజీనామా చేయనని చెప్పిన, ఎంపీ ఇప్పుడు అమరావతి కోసం రాజీనామా చేస్తానని చెప్పారు. అమరావతి రిఫరెండంగా రాజీనామా చేసి మళ్ళీ గెలుస్తానని రాజుగారికి బాగా కాన్ఫిడెన్స్ ఉన్నట్లు కనిపిస్తోంది. రాజుగారు ఇంత కాన్ఫిడెన్స్‌గా ఉండటానికి కారణం లేకపోలేదు.

ప్రధానంగా నరసాపురం పార్లమెంట్…విశాఖపట్నంతో పోలిస్తే, అమరావతికి దగ్గరగా ఉంటుంది. దీంతో ఇక్కడి ప్రజలు రాజధాని విషయంలో అమరావతి వైపే మొగ్గు చూపుతున్నారు. అదే సమయంలో రాజుగారు రాజీనామా చేసి ఉపఎన్నిక బరిలో ఉంటే, టీడీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలు సహకరించడం ఖాయం. 2019 ఎన్నికల్లోనే రాజుగారు వైసీపీ నుంచి పోటీ చేసి దాదాపు 30 వేల ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్ధి మీద గెలిచారు. అంటే వైసీపీకి టీడీపీ గట్టి పోటీ ఇచ్చింది. ఇదే సమయంలో జనసేనకు 2 లక్షల పైనే ఓట్లు వచ్చాయి. కాబట్టి టీడీపీ-జనసేనల సపోర్ట్ ఉంటే చాలు రాజుగారి గెలుపు సులువు అవుతుంది. అందుకే రాజుగారు అంత కాన్ఫిడెన్స్‌గా అమరావతి కోసం రాజీనామా చేసేస్తానని అంటున్నార‌న్న టాక్ వినిపిస్తోంది.

-vuyyuru subhash 

Read more RELATED
Recommended to you

Exit mobile version