వివాదాలు ఎలా ఉన్నా కూడా యాదగిరి గుట్ట బాగుంటుంది. వివాదాలు ఎన్ని ఉన్నా కూడా కేసీఆర్ మాట తీరు బాగుంటుంది. వివాదాలకూ నారసింహ రూపానికి అస్సలు సంబంధమ లేదు. అయినా మనం అనుకుంటాం కానీ ఇంతటి డబ్బులు ఖర్చు చేయడం వెనుక ఉద్దేశాలేంటి.. వ్యాపారాత్మకతతో కూడిన దృక్పథాల ఏంటి? ఇవే ఇప్పుడు చర్చకు తావిస్తున్నాయి. ఒకటి యాదగిరి గుట్ట వద్ద వెహికల్ పార్కింగ్ ఇష్యూ కాగా, మరొకటి కొండ చుట్టూ వికృత రీతిలో సాగిస్తున్న తవ్వకాలు మరియు నయా వెంచర్ల పేరిట సాగిస్తున్న రియల్ ఎస్టేట్ దందాలు. ఇవే ఇప్పుడు ప్రధాన చర్చకు తావిస్తున్నాయి.
ముఖ్యంగా ముందుగా ఆలయాన్ని చాలా బాగా సుందరీకరించారు అని ఆనందించాలి మనం. ఎందుకంటే కేసీఆర్ మాత్రమే తల్చుకుని తిరుపతితో పోటీ పడే విధంగా ఓ వైష్ణవాలయానికి ఎంతో ఖ్యాతి తెచ్చారు. కృష్ణ రాతితో చెక్కించిన శిల్పాలే అత్యంత ఆకర్షణీయం. ఇందుకు మొత్తం వెయ్యి కోట్లు ఖర్చు పెట్టారు. ఆ డబ్బులు ఎలా వెనక్కు వస్తాయి. అందుకేనేమో గంట వెహికల్ పార్కింగ్ కు ఐదు వందల రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇది కనిష్ట రుసుము. గరిష్టం ఎంతయినా కావొచ్చు.
ముందుగా చెల్లించిన ఐదు వందల రూపాయలు కాకుండా గంట దాటితే అక్కడి నుంచి అదనపు సమయానికి సంబంధించి ఛార్జి వేరుగా ఉంటుంది. అంటే అదనంగా ఉండే ప్రతి గంటకు వంద రూపాయల చొప్పున వెహికల్ పార్కింగ్ నిమిత్తం రుసుము చెల్లించాలని టీ సర్కారు చెబుతోంది. ఇదే ఇప్పుడు పెను వివాదాలకు తావిస్తోంది. ఎక్కడా లేని విధంగా కొండపైకి అనుమతించిన వాహనాలపై ఇంతటి భారీ స్థాయి బాదుడు తాము చూడలేదని, పక్క రాష్ట్రంలోనే కాదు ఇక్కడ కూడా బాదుడే బాదుడు తరహాలో డబ్బులు ముక్కు పిండి మరీ ! గుంజుకుంటున్నారని చాలా మంది భక్తులు సోషల్ మీడియాలో మండిపడుతున్నారు.
ఇక రెండో విషయానికే వస్తే.. రియల్ దందాలు కొండ చుట్టూ బాగానే జరుగుతున్నాయి అన్న విమర్శ వస్తోంది. అవును ! ఇది నిజమే ఆ రోజు తమ స్థలాలను ఆలయ అభివృద్ధి, రోడ్డు విస్తరణ పేరిట నామినల్ ఛార్జిస్ చెల్లించి గుంజుకున్న అధికారులు తరువాత పనులు పూర్తయ్యాక ఇక్కడ నిర్వాసితులు పట్టుబడితే కానీ పరిహారం చెల్లించలేదని, కానీ ఇవాళ ఆలయ అభివృద్థి అయ్యాక కొండ చుట్టూ మట్టి తవ్వకాలు యథేచ్ఛగా సాగిపోతున్నాయని స్థానికులు ఆధారాలతో సహా నిరూపిస్తున్నారు.
అంతేకాదు యాదగిరి కొండ చుట్టూ అనుమతులు లేకుండా కొన్ని లే ఔట్లు వేశారని, వీటిపై కూడా రెవెన్యూ యంత్రాంగం నిఘా లేదని అంటున్నారు. ఒకప్పటి కన్నా ఇప్పుడే తమ బతుకులు దుర్భరం అయ్యాయి అని వీరంతా కన్నీటి పర్యంతం అవుతున్నారు. కోట్ల విలువ చేసే భూములు లాక్కొన్న ప్రభుత్వ యంత్రాంగం ఇప్పుడు ఈ విధంగా ల్యాండ్ మాఫియాను మాత్రం నిలువరించలేకపోతోందని వాపోతున్నారు.