కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం.. కాపు ఉద్యమం నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకోవడం.. ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేయడం తెలిసిందే. “ఈ మధ్య పెద్దవారు చాలా మంది మన సోదరుల చేత.. నేను మానసికంగా కృంగిపోయే విధంగా సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా దాడులు చేయిస్తున్నారు.. ఈ విధంగా దాడులు ఎందుకు చేస్తున్నారో నాకైతే అర్థం కాలేదు.. ఉద్యమం చేసిన కాలంలో నేను వసూలు చేసిన నిధులు కానీ, పారిశ్రామిక వర్గాలను బెదిరించి సంపాదించిన డబ్బులు కానీ, అప్పటి ముఖ్యమంత్రి, ఇప్పటి ముఖ్యమంత్రి దగ్గర లొంగిపోయి.. మూటలతో కోట్లాది రూపాయిలు, నన్ను నిత్యం విమర్శించే మన సోదరులకు పంచలేదనా..? ఈ దాడికి కారణం” అని తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు ముద్రగడ! ఈ క్రమంలో ముద్రగడ మనస్తాపం వెనక ఎవరి పాత్ర ఎంతుందనేది ఒకసారి పరిశీలిద్దాం!
కాపు ఉద్యమం నుంచి తాను తప్పుకుంటున్నట్లు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సంచలన ప్రకటన చేసిన విషయంపై టీడీపీ నేత బోండా ఉమా మహేశ్వరరావు స్పందించారు. ఉద్యమం నుంచి ముద్రగడ తప్పు కోవటం సరికాదని.. నాయకత్వం వహించే వారిపై విమర్శలు సహజమేనని చెప్పుకొచ్చారు ఉమ. ముద్రగడపై సోషల్ మీడియా విమర్శలు చేసేది వైసీపీ వాళ్లేనని ఆయన ఆరోపించరు. ఆయన వాదన అలా ఉంటే… చంద్రబాబు విషయంలో జరిగిన సంగతులను లేఖలో పంచుకున్నారు ముద్రగడ!
“మన జాతికి బీసీ రిజర్వేషన్ ఇస్తానని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చిన సంగతి మీకు తెలియనిది కాదు. ఈ ఉద్యమం ద్వారా డబ్బు కానీ, పదవులు కానీ పొందాలని నేను ఏనాడూ అనుకోలేదు. ఉద్యమంలోకి వచ్చిన తర్వాత ఆర్థికంగాను, ఆరోగ్యం పరంగాను చాలా నష్టపోయాను. రాజకీయంగా ఎంతో నష్టపోయానో మీ అందరికీ తెలుసు. కానీ ఏ నష్టానికి నేనెప్పుడు చింతించలేదు” అంటూ… “ఆనాడు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి లేఖ రాస్తూ రిజర్వేషన్ ఇచ్చేయడం వల్ల నేను గొప్పవాడినికి అయిపోతానని మీరు అభిప్రాయపడవచ్చు. దయచేసి మీ ఆఫీసులో పనిచేసే వారి పేరు మీద లేఖ తీసుకుని.. పనిచేసి.. ఆ పేరు ప్రతిష్టలు మీరే పొందండి.. ఫలితాన్ని ఆశించే మనిషిని కాను” అని ఆనాడే చెప్పడం జరిగిందని ముద్రగడ తెలిపారు!
ఈ విషయంలో అసలు ముద్రగడకు సమస్య ఎక్కడినుంచి వచ్చింది.. ఆయన మనస్థాపానికి నిజమైన కారణం ఏమిటి అనే దిశగా ఆలోచించని బోండా ఉమ… నేరుగా వైకాపా విమర్శలు చేయడంపై వైకాపా నాయకులు ఫైరవుతున్నారు. నాడు కాపు రిజర్వేషన్ పేరు చెప్పీ బాబు చేసిన దారుణాలను గుర్తుకు తెస్తున్నారు!