వెంటిలేటర్‌పై ఉన్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీని వెలుగులోకి తీసుకువచ్చేందుకు చేస్తున్న ఏ ప్రయత్నమూ ఫలించడం లేదు. పైగా ఉన్న బలం కూడా ఆవిరవుతోంది. తాజాగా జరిగిన హుజూర్ నగర్ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ను విజయం దిశగా నడిపించాలని భావించిన నాయకులకు తీవ్ర ఎదురు దెబ్బతగిలింది. ఇక్కడ నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ నాయకురాలు, రాష్ట్ర పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి సతీమణి పద్మావతి ఘోరంగా ఓటమి పాలయ్యారు. వాస్తవానికి ఇది కాంగ్రెస్‌కు సిట్టింగ్ సీటు. గత ఏడాది జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ నుంచి ఉత్తమ్ విజయం సాధించారు.
అయితే, ఆయన తర్వాత జరగిన పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించడంతో ఈ సీటుకు ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ ఈ సీటును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సిట్టింగ్ సీటును కాపాడుకునేందుకు ప్రయత్నించింది. దీంతో నేరుగా ఉత్తమ్ తన భార్య పద్మావతిని ఇక్కడ నుంచి పోటీ చేయించారు. ఈమె గత ఏడాది జరిగిన ఎన్నికల్లో కోదాడ నుంచి పోటీ చేసి ఓటమిపాల య్యారు. ఇక్కడ నుంచి టీఆర్ఎస్ నేత మల్లయ్య విజయం సాధించారు.
అయితే, ఆయన అక్రమంగా గెలిచారంటూ.. పద్మావతి కోర్టులో కేసు వేశారు. ఈ కేసు విచారణ దశలో ఉండగానే హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేశారు. ఈ పరిణామం పద్మావతికి మైనస్ అయింది. అదేసమయంలో టీఆర్ ఎస్ కూడా ఇదే విషయాన్ని పొలిటి కల్ చేసింది. కోదాడలో తీర్పు వస్తే.. పద్మావతికి ఆ సీటు దక్కుతుందని ఆమె వల్ల ప్రయోజనం ఉండద ని ప్రచారం చేసింది. అదేసమయంలో అధికారంలో లేని, రాని కాంగ్రెస్ పార్టీకి ఓట్లేస్తే ఏంటి ప్రయోజనం అంటూ.. టీఆర్ఎస్ చేసిన ప్రచారం కూడా బాగానే వర్కవుట్ అయింది. ఇక, కేసీఆర్ పథకాలను కూడా ఇక్కడ ప్రచారం చేశారు. ఇక, డబ్బులు పోల్ మేనేజ్‌మెంట్‌లోనూ కాంగ్రెస్ వెనుకబడింది.
ఇవన్నీ ఇలా ఉంటే.. నాయకుల మధ్య వివాదాలు, అభిప్రాయ భేదాలు కూడా ఇక్కడి ఎన్నికలను తీవ్రంగానే ప్రభావితం చేయడం విశేషం. ఇక, రాజకీయ వ్యూహం ఎక్కడా ప్రతిపక్షాలను కలపలేక పోయింది. ముఖ్యంగా టీడీపీ వంటివి ఒంటరిపోరుకు దిగడంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చాయి. దీంతో కాంగ్రెస్ అనూహ్యంగా నష్టపోయిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మొత్తంగా చూసుకుంటే.. అధికార పార్టీని నిలువరించాలని భావించిన కాంగ్రెస్‌కు చేదు అనుభవమే మిగిలిందని చెప్పక తప్పదు!