మహిళా ఉద్యోగులు ఎదుర్కొనే లైంగిక వేధింపులపై ఫిర్యాదులు, వాటి పరిష్కారానికి ఆగస్టు 10వ తేదీలోగా జిల్లా (ప్రాంతీయ) స్థాయి కమిటీలు ఏర్పాటు చేయాలని ఆర్టీసీ ఎండీ ఎంటీ కృష్ణబాబు ఆదేశించారు. 17లోగా దీనికి సంబంధించిన వివరాలను కేంద్ర కార్యాలయానికి పంపాలని ప్రాంతీయ మేనేజర్లను(ఆర్‌ఎం) ఆదేశిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిటీలో ఐదుగురు సభ్యులు ఉండాలని, వారిలో కనీసం ముగ్గురు మహిళలు ఉండాలని తెలిపారు. డిపో మేనేజర్ లేదా సూపర్‌వైజర్ స్థాయి మహిళా అధికారి కమిటీ ఛైర్మన్‌గా ఉండాలని, మహిళా కండక్టర్, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధి సభ్యులుగా ఉండాలని అన్నారు.
కనీసం మూడు నెలలకోసారి ఈ కమిటీ సమావేశమై ఫిర్యాదులను పరిశీలించి నివేదిక సమర్పించాలన్నారు.. ఇకపై ఏటా జనవరి 10లోగా ఈ కమిటీలు ఏర్పాటు చేయాలని ఆయన వివరించారు. ఈ కమిటీలను ఏర్పాటు చేయాలని ఆదేశించినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు చెబుతున్నట్లు ఎన్‌ఎంయూఏ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పీవీ రమణారెడ్డి, వై శ్రీనివాసరావు తెలిపారు.