ఆంధ్రప్రదేశ్‌లో చిట్ ఫండ్ కంపెనీల్లో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. చిట్స్ పేరుతో సేకరిస్తున్న సొమ్మును నిబంధనలకు విరుద్ధంగా ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయించుకుంటున్నారని.. దానితో వడ్డీ వ్యాపారం చేస్తున్నారని ఆరోపణలు రావడంతో ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లుగా ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. చిట్ ఫండ్ కార్యకలాపాల్లోని మార్గదర్శి చిట్ పండ్ తో పాటు కపిల్ చిట్ ఫండ్, శ్రీరామ్ చిట్ ఫండ్ సంస్థలకు చెందిన కార్యాలయాల్లో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. మార్గదర్శి చిట్ ఫండ్స్ ఈనాడు గ్రూపు సంస్థలకు అధినేత రామోజీరావు కుటుంబం ఆధ్వర్యంలో నడుస్తున్న కంపెనీ అన్న విషయం తెలిసిందే.
అధిక వడ్డీల ఆశ చూపి చిట్ పాడుకున్న సభ్యులకు డబ్బు ఇవ్వకుండా తమ వద్దే ఫిక్స్ డ్ డిపాజిట్ చేయించుకుంటున్న సంస్థలు… ఆ నిధులతో వడ్డీ వ్యాపారం చేస్తున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఆరోపణల ఆధారంగానే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ అధికారులు ఆయా కార్యాలయాల్లో సోదాలు చేస్తున్నారు.