ట్విట్టర్ బాటలోనే మెటా కంపెనీ కూడా ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగులను తొలగిస్తోంది. ఇప్పటివరకూ మెటా 11వేల ఉద్యోగులను తొలగించింది. ఈమధ్యే పబ్లిక్ పాలసీ మెటా ఇండియా డైరెక్టర్ రాజీవ్ అగర్వాల్ కూడా పదవి నుంచి తప్పుకున్నాడు. దాంతో, మనదేశంలో వాట్సాప్ పబ్లిక్ పాలసీ డైరెక్టర్‌గా ఉన్న శివ్‌నాథ్ తుక్రల్ అన్ని మెటా బ్రాండ్లకు పబ్లిక్ పాలసీ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించనున్నాడు. అయితే.. ఇప్పుడు మెటా కంపెనీకి మరో ఎదురుదెబ్బ తగలింది. వాట్సాప్ ఇండియా హెడ్ అభిజిత్ బోస్ ఈరోజు రాజీనామా చేశాడు. వాట్సాప్ ఇండియా మొదటి హెడ్‌గా 2018లో అభిజిత్ బాధ్యతలు చేపట్టాడు. వాట్సాప్‌లో యూపీఐ పేమెంట్ ఫీచర్ తీసుకురావడంలో అతని కృషి ఎంతో ఉంది.
వాట్సాప్‌ని దేశంలోని ప్రజలందరికీ చేరువ చేయడంలో అభిజిత్ విజయం సాధించాడు. అతను పదవి నుంచి తప్పుకోవడానికి కారణాలు మాత్రం తెలియడం లేదు. అభిజిత్ వాట్సాప్ ఇండియా హెడ్‌గా బాధ్యతలు చేపట్టడానికి ముందు ఎజెటాప్ అనే పేమెంట్ కంపెనీలో పనిచేశాడు. మెటా కంపెనీ ఉద్యోగులను తొలగిస్తూ నిర్ణయం తీసుకున్న వారంలోనే అభిజిత్ రాజీనామా చేశాడు. ‘వాట్సాప్ ఇండియా మొదటి హెడ్‌గా ఎనలేని సేవలు అందించిన అభిజిత్‌కు ధన్యవాదాలు. వాట్సాప్‌లో కొత్త సేవలు ప్రారంభించడానికి, వాట్సాప్ వ్యాపారం పెరగడానికి అతని ఎంట్రప్రెన్యూర్ స్కిల్స్ ఎంతగానో ఉపయోగపడ్డాయి’ అని వాట్సాప్ హెడ్ విల్ కాథ్‌కార్ట్ ఒక ప్రకటనలో తెలిపాడు.