ముకేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇప్పటికే టిక్‌టాక్ కొనుగోలుకు ప్రయత్నాలు ప్రారంభించిన విషయం విదితమే. అయితే తన రిటెయిల్ సామ్రాజ్యాన్ని మరింత విస్తరించడం కోసం మరిన్ని కంపెనీలను కొనుగోలు చేయాలని రిలయన్స్ భావిస్తోంది. అందులో భాగంగానే ఆ కంపెనీ ఆన్‌లైన్ ఫర్నిచర్ సైట్ అర్బన్ ల్యాడర్‌తోపాటు పాలు, పాల ఉత్పత్తులను ఆన్‌లైన్ డెలివరీ చేసే మిల్క్ బాస్కెట్ అనే కంపెనీని కూడా కొనుగోలు చేయాలని చూస్తున్నట్లు తెలిసింది.
అర్బన్ ల్యాడర్ కొనుగోలుకు రిలయన్స్ రూ.224.54 కోట్ల వరకు చెల్లించేందుకు ముందుకు వచ్చినట్లు తెలిసింది. అయితే చర్చలు ఇంకా నడుస్తున్నందున త్వరలోనే అర్బన్ ల్యాడర్ ఈ విషయంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు మిల్క్‌బాస్కెట్ కొనుగోలుకు రిలయన్స్ ఇంకా ఫలానా మొత్తం అని ఆ కంపెనీకి ఆఫర్ చేయలేదు. కానీ ఆ డీల్ కూడా త్వరలోనే ముగుస్తుందని తెలుస్తోంది. ఈ రెండింటినీ కొనుగోలు చేయడం ద్వారా రిలయన్స్ రిటెయిల్ రంగంలో మరింత ముద్ర వేయాలని చూస్తోంది.
మరోవైపు ఇ-ఫార్మసీ స్టార్టప్ నెట్‌మెడ్స్‌ను కూడా రిలయన్స్ కొంటుందని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే అమెజాన్‌లో ఇ-ఫార్మసీ ప్రారంభం కాగా.. దాంతోపాటు ఫ్లిప్‌కార్ట్ కూడా గ్రోసరీ బిజినెస్‌ను మరింత విస్తృతం చేస్తోంది. అందువల్ల ఈ రెండు కంపెనీలకు పోటీ ఇవ్వడం కోసమే రిలయన్స్ ఆయా కంపెనీలను కొనుగోలు చేస్తున్నట్లు స్పష్టమవుతుంది. మరికొద్ది రోజులు వేచి చూస్తే ఈ వివరాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.