గుజరాత్ తొక్కిసలాట కేసు.. సుప్రీం కోర్టులో షారుఖ్‌ ఖాన్‌కు ఊరట

-

సుప్రీం కోర్టులో బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కు ఊరట లభించింది. గుజరాత్ లోని వడోదర రైల్వే స్టేషన్ లో తొక్కిసలాటకు కారణమయ్యారన్న కేసులో షారుఖ్ ఖాన్ పై నమోదైన క్రిమినల్‌ కేసును కొట్టేయాలంటూ గుజరాత్‌ హైకోర్టు గతంలో జారీ చేసిన ఆదేశాలను సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది. హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ.. దాఖలైన పిటిషన్‌పై జస్టిస్‌ అజయ్‌ రస్తోగి, జస్టిస్‌ సీటీ రవికుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. గుజరాత్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది.

‘రాయిస్‌’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా 2017లో షారుఖ్‌ ఖాన్‌ తన నిర్మాణ బృందంతో కలిసి ముంబయి నుంచి దిల్లీకి రైలులో వెళ్లారు. మార్గమధ్యంలో వడోదర స్టేషన్‌లో ఆయన్ను చూసేందుకు పెద్దఎత్తున అభిమానులు తరలివచ్చారు. అయితే, గుమిగూడిన జనంపై ఆయన టీ షర్టులు, స్మైలీ బాల్స్‌ విసరడం.. తొక్కిసలాటకు దారి తీసిందని ఆరోపిస్తూ, ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జితేంద్ర మధుభాయ్‌ సోలంకి అనే వ్యక్తి వడోదర కోర్టులో ఫిర్యాదు చేశారు.

దాన్ని కొట్టేయాలని కోరుతూ షారుఖ్.. గుజరాత్‌ హైకోర్టును ఆశ్రయించగా, ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చింది. ఫిర్యాదుదారుడు దీన్ని సుప్రీంకోర్టులో సవాల్‌ చేయగా.. తాజాగా షారుఖ్‌కు మరోసారి ఊరట లభించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version