మణిపూర్ రాష్ట్రంలో ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో అధికార బీజేపీలో రాజకీయ సంక్షోభం ముదురుతోంది. 19మంది బీజేపీ ఎమ్మెల్యేలు సీఎం బీరెన్ సింగ్‌కు వ్యతిరేకంగా ప్రధాని మోడీకి లేఖ రాశారు. ఈ లెటర్‌పై సంతకం చేసిన వారిలో అసెంబ్లీ స్పీకర్ తోంగ్ చోమ్ సత్యవ్రత్ సింగ్, మంత్రి తొంగం విశ్వజిత్ సింగ్, యుమ్నం ఖేమ్‌చంద్ సింగ్ ఉన్నారు. సీఎం పదవి నుంచి బీరెన్ సింగ్‌ను తొలగించి వేరే వారిని నియమించాలని ఆ లేఖలో పేర్కొన్నారు.
గత మంగళవారం ఢిల్లీలో జరిగిన మైటీ, కుకీ, నాగా ఎమ్మెల్యేల మీటింగ్ అనంతరం ఈ లేఖ రాసినట్లు సమాచారం. వీరంతా అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కావడం గమనార్హం. రాష్ట్రంలో శాంతిస్థాపన, సాధారణ పరిస్థితుల పునరుద్ధరణతో పాటు పౌరుల కష్టాలను దూరం చేయడంలో ప్రభుత్వ సామర్థ్యాన్ని మణిపూర్ ప్రజలు ప్రశ్నిస్తున్నారని ఆ లేఖలో ఎమ్మెల్యేలు ప్రస్తావించారు.వెంటనే సమస్యకు పరిష్కారం చూపించకపోతే సీఎంతో రాజీనామా చేయించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారని ప్రధానికి రాసిన లేఖలో ఐదుగురు బీజేపీ ఎమ్మెల్యేలు కోరారు.