మూసీ ప్రక్షాళణకు బీజేపీ వ్యతిరేకం కాదని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ పేర్కొన్నారు. తాజాగా ఆమె ఓ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడారు. మూసీ నీటిని మంచి నీటిగా మారుస్తామన్నందుకు తాము వ్యతిరేకం కాదని.. మూసీ ప్రక్షాళన పేరుతో లక్షల కోట్లు ఖర్చు పెట్టాలనే ఆలోచనను మాత్రమే వ్యతిరేకిస్తున్నామని.. దీని పేరుతో పేదల ఇండ్లను కూలగొట్టడాన్ని బీజేపీ వ్యతిరేకిస్తుందన్నారు.
మూసీ నది వెంట నివసిస్తున్న వారిని నిరాశ్రయులను చేయకుండా రీటైనింగ్ వాల్ కట్టి ప్రక్షాళన చేయవచ్చని.. దీనికి కూడా లక్షల కోట్లు అవసరం లేదని తెలిపారు. అసలు డీపీఆర్ లేకుండా ఇండ్లను ముందే ఎందుకు కూలగొడుతున్నారని మండిపడ్డారు. ఏ డీపీఆర్ తయారు చేయకుండా లక్షన్నర కోట్లు అని కాంగ్రెస్ నాయకులే చెబుతున్నారని.. బీఆర్ఎస్ పార్టీ కాళేశ్వరం పేరులో దోచుకున్నట్టే. వీళ్లు కూడా మూసీ పేరుతో దోచుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఈ లక్షల కోట్ల దోపిడీ యత్నాన్ని బీజేపీ వ్యతిరేకిస్తుందని వ్యాఖ్యానించారు.