సీఎం కేసీఆర్, కేటీఆర్ లపై కాంగ్రెస్ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వ విప్ బాల్క సుమన్ మండిపడ్డారు. రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డి తెలంగాణ ద్రోహి అని ఆరోపించారు. రేవంత్ బారి నుంచి తెలంగాణ కాంగ్రెస్ ను కాపడుకోవడంపై రాహుల్ దృష్టి పెట్టాలని సూచించారు. రేవంత్ రెడ్డి పెయిడ్ ఆర్టిస్ట్ అని విమర్శించారు. మరోసారి చిప్పకూడు తినడానికి సిద్ధంగా ఉండాలని రేవంత్ రెడ్డికి బాల్క సుమన్ వార్నింగ్ ఇచ్చారు. కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి.. బీజేపీ నేతలు గుజరాత్ కు గులాంలు అని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడని.. తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. రాహుల్ గాంధీకి తెలుగు రాదని.. వీళ్లు ఎవరో పంపితే ధాన్యం కొనుగోలుపై పోస్ట్ చేశాడని ఆయన అన్నారు. తెలంగాణ రైతుల పక్షాన కాంగ్రెస్ ఎన్నడూ నిలవలేదని అన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులను అడ్డుకునేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నాలు చేసారని ఆరోపించారు. ఇరిగేషన్ ప్రాజెక్టులపై చర్చించలేక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుంచి మొహం చాటేశారని ఎద్దేవా చేశారు. లోపాయికారిగా బీజేపీకి కాంగ్రెస్ చిత్తశుద్దితో సహకరిస్తుందని.. బీజేపీకి అవుట్ సోర్సింగ్ ఏజెంట్ లా రేవంత్ పనిచేస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో బీజేపీకి రేవంత్ రెడ్డి సహకరిస్తున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డిది నకిలీ, మకిలీ చరిత్ర అని.. చంచల్ గూడలో చిప్పకూడు తిన్న 420 రేవంత్ రెడ్డి అని.. పెయింటర్ రెడ్డి నుంచి పెయిడ్ రెడ్డిగా అయ్యారని తీవ్ర స్థాయిలో విమర్శించారు.