డబ్బు ఎలా అయిన పొందవచ్చు..దాచవచ్చు. కానీ అప్పు రూపేణ తెచ్చిన డబ్బు వెంటనే వీలున్నంత త్వరగా తీర్చేయాలన్న సోయి ఒకటి ఉండాలి. కానీ మన విపక్ష నాయకులు మీరు డబ్బులు కట్టవద్దు అని రైతులకు పదే పదే చెబుతున్నారు. ఆ విధంగా ఉద్దేశ పూర్వక ఎగవేతదారులను హాయిగా సిద్ధం చేస్తున్నారు. ఇదే ఎంత తప్పో ఎంత గొప్ప ఆర్థిక నేరమో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కొడంగల్ రచ్చబండ వేదికపై చేసిన వ్యాఖ్యలు అస్సలు ఆమోద యోగ్యం కావు. ఎలానో చూద్దాం.
వాస్తవానికి తాము అధికారంలోకి రాగానే రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెబుతూ వ్యవసాయ దారులకు హామీ ఇస్తున్నారు. ఇదే హామీ కౌలు రైతులకూ వర్తితం అవుతుందో లేదో అన్నది తరువాత ! ఇప్పటికే బ్యాంకులకు అప్పులు చెల్లించని వర్గాల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. రుణాలు అందించకపోతే టార్గెట్లు విధించి మరీ ! కలెక్టర్లు పరుగులు తీయిస్తున్నారు. అందుకు పాలక పార్టీలూ కారణం అవుతున్నాయి.ఇదంతా బాగుంది మనం ఎక్కడో ఉన్న మాల్యాని ఉద్దేశించి మాట్లాడుతున్నాం తప్పు కాదు కానీ రైతు రుణం ఏ మేరకు తీర్చగలడు.. ఏ మేరకు తీర్చలేడు అన్న అంచనా అయితే లేకుండానే గంపగుత్తగా రుణ మాఫీ ప్రకటన చేసి ప్రభుత్వాలు ఏటా మిగిలిన వర్గాలపై సంబంధిత ఆర్థిక భారం మోపుతున్నాయి.
ఎన్నికలకు ఏడాది కాలం ఉందనగానే ఇటువంటి ముందస్తు సూచనలు లేదా ప్రకటనలు చేయడం ద్వారా మొండి బకాయిలు పెరిగేందుకు అవకాశం ఉంది. ఇప్పటికే సబ్సిడీల పేరిట రుణాలు ఇస్తూ కొన్ని వర్గాలను ప్రోత్సహిస్తూ ఆ భారాన్ని కూడా మధ్యతరగతి జీవులపై వేస్తున్నాయి ప్రభుత్వాలు.. ఇదే సమయంలో రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీ రెండు లక్షల వరకూ చేస్తామని చెప్పి పెద్ద విస్ఫోటనమే తెచ్చారు. కానీ ఇదెంత మాత్రం భావ్యం కాదు అని బ్యాంకర్లు అంటున్నారు.
రుణాలు చెల్లించే స్థోమత ఉండీ, పంట చేతికి చిక్కాక ఎగవేత ధోరణిలో ఉన్న రైతులు కూడా ఉన్నారని, అంతా సేద్యం ద్వారా దివాలా తీసిన వారే అనుకోలేం అని అంటూనే రుణ మాఫీ కన్నా కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో జరిగిన విధంగా వడ్డీ మాఫీ చేయడం, సకాలంలో రుణాలు తిరిగి చెల్లించిన వారికి ప్రోత్సాహకాలు అందించడం మంచిది అన్నది బ్యాంకర్ల వాదన ! వీటితో విపక్ష పార్టీలే కాదు పాలక పక్షాలూ పెద్దగా ఏకీభవించవులేండి. కానీ ఇటువంటి ప్రకటనలే అత్యంత ప్రమాదకరం అని ప్రజలు గుర్తిస్తే మేలు. లేదంటే జాతీయ బ్యాంకులు అన్నీ బోర్డులు తిరగవేయడం ఖాయం.