ఒక నగర మేయర్‌గా రెండోసారి ఎన్నికై బ్రిటన్‌లో భారత సంతతి వ్యక్తి మరో ఘనత సాధించారు. ఢిల్లీలో పుట్టిన సునీల్ చోప్రా, లండన్‌లోని బరో ఆఫ్ సౌత్‌వార్క్ మేయర్‌గా మరోసారి విజయం సాధించారు. ఈ మేరకు శనివారం ఆయన ప్రమాణం స్వీకారం చేశారు. సునీల్ చోప్రా పిల్లల దుస్తులు, వస్తువులకు సంబంధించిన వ్యాపారం 1979లో బ్రిటన్‌కు వచ్చిన ప్రారంభించారు. సౌత్‌వార్క్‌లో సునీల్ చోప్రా హిందూ కమ్యూనిటీ సెంటర్‌కు సహ వ్యవస్థాపకులుగా ఉన్నారు. సాంస్కృతిక, సమాజ కార్యక్రమాల ద్వారా భారతీయ సంస్కృతిని చాటడంతోపాటు అక్కడి ప్రజలకు చేరువయ్యారు.
అనంతరం 2010లో ఆ దేశ రాజకీయాల్లోకి సునీల్ చోప్రా ప్రవేశించారు. బ్రిటన్‌లోని లేబర్ పార్టీకి చెందిన సునీల్ చోప్రా 2014-15లో తొలిసారి సౌత్‌వార్క్ బరో మేయర్‌గా ఎన్నికయ్యారు. దీనికి ముందు డిప్యూటీ మేయర్‌గా మూడు సార్లు ఉన్నారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో సునీల్ చోప్రా నేతృత్వంలో లండన్ బ్రిడ్జ్, వెస్ట్ బెర్మాండ్సే స్థానాల్లో లిబరల్ డెమోక్రాట్‌లపై లేబర్ పార్టీ విజయం సాధించింది. దశాబ్దాలుగా ఈ సీట్లు ప్రతిపక్ష పార్టీకే దక్కాయి. లండన్‌లోని బరో ఆఫ్ సౌత్‌వార్క్ కౌన్సిల్‌లో భారతీయ సంతతి ప్రజలు కేవలం రెండు శాతం మాత్రమే ఉన్నారు. అయినప్పటికీ లేబర్ పార్టీ ఘన విజయం సాధించడం ఆయనకు మరోసారి మేయర్ పీఠాన్ని దక్కేలా చేసింది.