కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో తన నామినేషన్ దాఖలు చేశారు. వేలాది మంది కార్యకర్తలతో బల ప్రదర్శన మాదిరిగా వెళ్లి నామనేషన్ దాఖలు చేశారు. కొడంగల్‌లోని తన నివాసం వద్ద వివిధ మండలాలు, గ్రామాల నుంచి వచ్చిన వేలాదిమంది కార్యకర్తలతో ముచ్చటించిన ఆయన తన విజయంపై ధీమా వ్యక్తం చేశారు. ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్న ఆయన. ఎన్నికల రిటర్నింగ్ అధికారి అరుణ కుమారికి నామ పత్రాలను అందజేశారు. రేవంత్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో మహాకూటమి పక్షాలైన తెదేపా, సీపీఐ పార్టీల కార్యకర్తలు, నేతలు హాజరయ్యారు. తాండూరు కాంగ్రెస్ అభ్యర్థి పైలెట్ రోహిత్ రెడ్డి సైతం రేవంత్ రెడ్డి ర్యాలీలో పాల్గొని సంఘీభావం ప్రకటించారు. నామినేషన్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.
నామినేషన్ అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… ఇంతమంది ప్రజల భావోద్వేగాలతో కూడిన నామినేషన్ తన జీవితంలో వేస్తాననుకోలేదన్నారు. తన జీవితంలో తుదిశ్వాస వరకు, చివరి రక్తపు బొట్టు వరకు కొడంగల్ ప్రజల కోసమే పనిచేసేందుకు తనకు భగవంతుడు అవకాశం ఇచ్చాడన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం తథ్యం అంటూ జోష్యం చెప్పారు.