కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డికి జూబ్లీహిల్స్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ స్థలాల కేటాయింపులో అక్రమాలు చోటు చేసుకున్నాయనే ఆరోపణలపై గత కొన్నేళ్లుగా విచారణ సాగుతున్న సంగతి తెలిసిందే.. ఈ నేపథ్యంలో 2003 – 2005 మధ్య కాలంలో సొసైటీ పాలక మండలి లో రేవంత్ రెడ్డి సభ్యుడిగా ఉన్నారు. దీంతో పోలీసులు విచారణ నిమిత్తం ఆయన్ను 15 రోజుల్లోగా తమ ఎదుట హాజరు కావాలని పేర్కొన్నారు.
నోటీసులను అందుకున్న రేవంత్ రెడ్డి ఎన్నికల హడావుడిలో ఉన్నందువల్ల తనకు కొంత సమయం కావాలని పోలీసులను కోరారు. రేవంత్ రెడ్డితో పాటు నాడు సభ్యులుగా ఉన్న మరో 13 మందికి కూడా సీఆర్పీసీ సెక్షన్ 41 కింద నోటీసులు జారీ చేశారు. ముందస్తు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మొన్న జగ్గారెడ్డి అరెస్ట్, నేడు రేవంత్ రెడ్డికి నోటీసులు అందడంపై రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.