ఇంగ్లండ్ గడ్డపై భారత్ 1-4 తేడాతో సిరీస్‌ను కోల్పోయిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ ఐసీసీ ప్రకటించిన టెస్ట్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా మొదటి స్థానంలోనే నిలిచింది. ఇంగ్లండ్ చేతిలో 4 టెస్టుల్లో టీమిండియా ఓటమి పాలవ్వగా ఖాతాలో 10 పాయింట్లు తగ్గాయి. అయినప్పటికీ ఇండియా నంబర్ వన్ ర్యాంకును టెస్టుల్లో నిలబెట్టుకుంది. ఇక భారత్ తరువాతి స్థానంలో సౌతాఫ్రికా ఉంది. అలాగే భారత్‌ను ఓడించిన ఇంగ్లండ్ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో నాలుగో స్థానానికి చేరుకుంది.
ఇక ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో మొత్తం 5 మ్యాచ్‌లలో కలిపి కోహ్లి 593 పరుగులు చేశాడు. దీంతో 930 పాయింట్లతో కోహ్లి ఐసీసీ టెస్ట్ బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో ప్రథమ స్థానంలో కొనసాగుతున్నాడు. అలాగే ఒక పాయింట్ తేడాతో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ (929) ఈ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో ఉండగా, కేన్ విలియమ్సన్ (847), జో రూట్ (835), డేవిడ్ వార్నర్ (820)లు తరువాతి స్థానాల్లో నిలిచారు.
అలాగే బౌలర్ల జాబితాకు వస్తే ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ 899 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. భారత్ తరఫున రవీంద్ర జడేజా 814 పాయింట్లతో 4వ స్థానంలో ఉండగా, అశ్విన్ 769 పాయింట్లతో 8వ స్థానంలో ఉన్నాడు.