తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా ఎంపీ రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. గాంధీభవన్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి నుంచి పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నారు రేవంత్ రెడ్డి. అనంతరం బహిరంగ సభలో రేవంత్ మాట్లాడుతుండగా సీఎం అంటూ నినాదాలు చేశారు కాంగ్రెస్స్ కార్యకర్తలు. అయితే దీనిపై స్పందించిన రేవంత్ రెడ్డి.. కార్యకర్తలకు వార్నింగ్ ఇచ్చారు. ఎవరైనా ఇప్పటి నుండి సీఎం అని నినాదాలు చేస్తే పార్టీ లో ఉండరని హెచ్చరించారు. అలాంటి వారిని పార్టీ నుండి బయటకు పంపిస్తానని.. వ్యక్తిగత నినాదాలు పార్టీకి నష్టమన్నారు.
తనను అభిమానించే వాళ్ళు అయితే వ్యక్తిగత స్లోగన్ వద్దని.. తెలంగాణ తల్లి… సోనియా గాంధీ నే అని స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి. 60 యేండ్ల కల సాకారం అయ్యింది అంటే కారణం సోనియా అని.. ఇప్పటి నుండి జై కాంగ్రెస్… జై సోనియా గాంధీ అనే నినాదాలు మాత్రమే ఉండాలని కార్యకర్తలకు చెప్పారు. తనపై అభిమానం తో సీఎం అంటున్నారు కానీ… అది కాంగ్రెసు పార్టీకి తీవ్ర నష్టం చేస్తుందని మండిపడ్డారు. ఇప్పటి నుండి ఎవరు సీఎం అని నినాదాలు చేయొద్దని విజ్ఞప్తి చేశారు.