తెలంగాణలో అభయహస్తం పేరిట మేనిఫెస్టోను ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆ మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై ఫోకస్ పెడుతోంది. ఇప్పటికే ప్రకటించిన ఆరు గ్యారెంటీలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లిన నేతలు.. ఇప్పుడు మేనిఫెస్టో విషయంలో కూడా అదే ప్రణాళిక ఫాలో అవనున్నారు. ఇందులో భాగంగా ప్రధాన నేతలు, అభ్యర్థులు ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించనున్నారు. ఇప్పటికే ప్రచారాన్ని ముమ్మరం చేసిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇప్పుడు ఇంకాస్త స్పీడ్ పెంచనున్నారు.
ఇందులో భాగంగా ఇవాళ ఆయన పోటీ చేస్తున్న కామారెడ్డి నియోజకవర్గంలో పర్యటించనున్నారు. అక్కడ చిన్నమల్లారెడ్డి, రాజంపేట, బిక్నూర్ కార్నర్ మీటింగుల్లో రేవంత్ పాల్గొననున్నారు. ఈరోజు మధ్యాహ్నం 3.30 గంటలకు చిన్నమల్లారెడ్డి.. సాయంత్రం 5.00 గంటలకు రాజంపేట.. రాత్రి 7 గంటలకు బిక్నూర్ కార్నర్ మీటింగ్లో పాల్గొని ప్రసంగించనున్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలోని 37 అంశాలను ప్రజలకు వివరించనున్నారు. అధికారంలోకి రాగానే 100 రోజుల్లో ఆరు హామీలను తప్పకుండా అమలు చేస్తామని హామీ ఇవ్వనున్నారు. రేవంత్ పర్యటన నేపథ్యంలో కామారెడ్డి నియోజకవర్గంలోని కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా ఏర్పాట్లు చేశారు.