తెలంగాణ రాజకీయాల్లో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య ట్రైయాంగిల్ ఫైట్ నడుస్తున్న సంగతి తెలిసిందే. అధికార టీఆర్ఎస్…ప్రతిపక్షాలు కాంగ్రెస్, బీజేపీలని దెబ్బకొట్టడానికి చూస్తుండగా, కాంగ్రెస్ ఏమో టీఆర్ఎస్‌ని టార్గెట్ చేస్తూనే, బీజేపీకి చెక్ పెట్టాలని చూస్తోంది. అటు బీజేపీ సైతం అధికార టీఆర్ఎస్‌కు తామే ప్రత్యామ్నాయం అని చెబుతూనే, కాంగ్రెస్‌ని పుంజుకొనివ్వకుండా చూడాలని అనుకుంటుంది.
అయితే ఎన్నికల సమయం వచ్చేసరికి ఈ మూడు పార్టీల మధ్య త్రిముఖ పోరు జరగడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక అప్పుడు సత్తా చాటాడానికి ఇప్పటినుంచే అదిరిపోయే వ్యూహాలతో పార్టీలు ముందుకెళుతున్నాయి. ఈ క్రమంలోనే టీపీసీసీ రేవంత్ రెడ్డి తనదైన శైలిలో ముందుకెళుతున్నారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని గట్టిగా టార్గెట్ చేస్తూనే, ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు. మళ్ళీ కాంగ్రెస్‌కు కొత్త ఉత్సాహం తీసుకొస్తున్నారు.
అయితే వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్‌ని ఎదురుకోవాలంటే కాంగ్రెస్ బలం సరిపోతుందా? అంటే చెప్పలేని పరిస్తితి ఉంది. అలా అని వేరే పార్టీలతో పొత్తు పెట్టుకున్న ప్రయోజనం ఉంటుందా? అనేది కూడా చెప్పలేం. ఎందుకంటే 2018 ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ, కమ్యూనిస్టులు, కోదండరాం పార్టీలు పొత్తు పెట్టుకుని దారుణంగా విఫలమయ్యాయి. మళ్ళీ ఆ దిశగా రేవంత్ ఆలోచన చేసే అవకాశం లేదు. కాకపోతే జాతీయ స్థాయిలో కమ్యూనిస్టులు, కాంగ్రెస్‌కు దగ్గరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇప్పటికీ ఆ పార్టీలు కాస్త కాంగ్రెస్‌కు అనుకూలంగానే ఉన్నారు. ఇటు తెలంగాణలో ఉన్న కమ్యూనిస్టు నేతలు సైతం రేవంత్ రెడ్డికి మద్ధతుగా మాట్లాడుతున్నట్లే కనిపిస్తోంది. అయితే తెలంగాణలో కమ్యూనిస్టులకు బలం పూర్తిగా తగ్గిపోయింది. కాకపోతే ఏజెన్సీ, గిరిజన ప్రాంతాల్లో ఆ పార్టీకి కాస్త ఓటు బ్యాంక్ అలాగే ఉన్నట్లు కనిపిస్తోంది. ఇలాంటి తరుణంలో నెక్స్ట్ ఎన్నికల్లో కాంగ్రెస్, కమ్యూనిస్టులు పొత్తు పెట్టుకుంటే కాస్త అడ్వాంటేజ్ అయ్యే ఛాన్స్ ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ విషయంలో రేవంత్ స్ట్రాటజీ ఎలా ఉంటుందో చూడాలి.