జీతం మీద ఆధారపడిన జీవితం.. ఒక్క నెల శాలరీ రాకపోతేనే ఆగం ఆగం అవుతారు. నేడు ఎంతోమంది పరిస్థితి ఇలానే ఉంది.. అలాంటిది కరోనా టైంలో ఉద్యోగాలు పోయిన వారి పరిస్థితి ఏంటి..? పాపం చాలా నెలలు ఇంట్లోనే ఉండి సర్థుకుపోయి..ఎలాగోలా నెట్టుకొచ్చారు. ఇంగ్లాడ్ లోని ఓ అమ్మయికి కూడా కరోనా వల్ల జాబ్ పోయింది.. కానీ ఆమె మళ్లీ కొత్త జాబ్ కోసం వేట మొదలుపెట్టలేదు.. ఇంట్లోనే ఉండి వ్యాయామాల మీద దృష్టి పెట్టింది. అందులోనూ స్కిప్పింగ్ రోప్ ఎక్సర్ సైజ్ చేస్తూ దాన్నే కెరీర్ గా మలుచుకుంది.. ఇక్కడ వరకు ఉంటే అందులో ఏం హైలెట్ ఉంది..? ఆ స్కిప్పింగ్ రోప్ తో ఆదాయం లక్షల్లో వస్తుంది. అది కదా హైలెట్..! అసలేంటి కథ, రోప్ తో లక్షల సంపాదన ఏంటి అనేగా మీ డౌట్.. అయితే ఈ కథ చదివేయండి..!
ఇంగ్లండ్‌లోని సెయింట్ ఆల్బన్స్‌కు చెందిన లారెన్ ఫ్లైమెన్ స్థానికంగా ఓ సేల్స్ కంపెనీలో పనిచేసేది. వృత్తిరీత్యా ఎక్కువ సమయం ఫీల్డ్ లోనే ఉండేది.. ఒక రకంగా ఇది ఆమెలో అసహనానికి దారితీసింది. ఇదే సమయంలో కరోనా విజృంభించడం, లారెన్ తన ఉద్యోగాన్ని కోల్పోవడం జరిగింది..ఎంత ఇష్టం లేని ఉద్యోగం అయినా.. అది కూడా పోతే.. పైసలకు ఇబ్బందేగా.
ఉన్న జాబ్ పోయింది.. అనుకున్న పెళ్లి వాయిదా పడింది. ఇలా తనకు కలిసి రాని సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి, ప్రతికూల ఆలోచనల్ని అధిగమించడానికి దగ్గర్లోని జిమ్‌లో చేరింది.. అక్కడ ఓ మూలకు పడి ఉన్న స్కిప్పింగ్ రోప్‌ను చూసి.. దాంతో విభిన్న రకాలుగా స్కిప్పింగ్ సాధన చేయడం ప్రారంభించింది. ఈ క్రమంలో శారీరకంగా దృఢంగా మారడంతో పాటు.. మానసిక ప్రశాంతతను పొందడం లారెన్ అనుభవించింది. ఇదేదో బాగుందే అనుకుని.. తన స్కిప్పింగ్ రోప్ వీడియోలను, తనకు తెలిసిన ఫిట్‌నెస్ టిప్స్‌ను తన ఇన్‌స్టాలో పంచుకుంది. అలా క్రమంగా తన ఫాలోవర్లను పెంచుకుంటూ పోయిన లారెన్.. ఏడాదిన్నర వ్యవధిలోనే ఫిట్‌నెస్ ఐకాన్‌గా మారిపోయింది.
సోషల్ మీడియాలో ‘లారెన్ జంప్స్’ పేరుతో పాపులర్ అయిన లారెన్.. వారానికి ఆరు గంటలు స్కిప్పింగ్ వర్కవుట్‌కి సమయం కేటాయిస్తుంది.. ఇక మిగతా సమయాన్ని దీనికి సంబంధించిన కంటెంట్‌ని, ట్యుటోరియల్ వీడియోలు రూపొందించడానికి పెడుతుంది. ఈ క్రమంలోనే తన అనుభవాల గురించి అడిగితే.. మనసు నిండా ప్రశాంతత, చేతి నిండా డబ్బు.. ఈ రెండూ స్కిప్పింగ్ వల్ల వచ్చాయని ఆనందంగా చెబుతుంది లారెన్.
లారెన్‌కు ఇన్‌స్టాలో 10 లక్షలకు పైగానే అనుసరిస్తున్నారు. ఆమె పెట్టే వీడియోలు, చెప్పే సూచనలు పాటిస్తూ తామూ ఈ వర్కవుట్‌తో ప్రయోజనం పొందుతున్నామంటూ కామెంట్లు పోస్ట్ చేస్తుంటారు. ఇలా తన స్కిప్పింగ్ వీడియోలతో ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన లారెన్‌కు ఎన్నో ప్రముఖ డైట్ బ్రాండ్స్, స్పోర్ట్స్ వేర్ బ్రాండ్స్ నుంచి తమకు ప్రచారకర్తగా వ్యవహరించాలంటూ ఆహ్వానాలు అందాయి. ప్రస్తుతం వాళ్ల ఉత్పత్తుల్ని ధరిస్తూ – డైట్ టిప్స్ పాటిస్తూ.. స్కిప్పింగ్ రోప్ వ్యాయామాలు చేస్తూ లక్షలు సంపాదిస్తోంది లారెన్. అంతేకాదు.. విభిన్న రకాల స్కిప్పింగ్ రోప్స్ తయారుచేయిస్తూ.. వాటినీ సోషల్ మీడియాలో విక్రయిస్తోంది.
View this post on Instagram