రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, ఎగువ ప్రాంతాల నుంచి వస్తోన్న వరదల నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. వరద నీటిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేర్చాలని సంబంధిత అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. విపత్తు నిర్వహణ శాఖ, రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ(ఆర్టీజీఎస్)ల సూచనలకు అనుణంగా సమన్వయంతో కలిసి పనిచేయాలన్నారు. వర్షాల కారణంగా కూలిపోయి, కొట్టుకుపోయిన వంతెనలకు ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసి, ప్రాణ నష్టం జరగకుండా జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉండాలన్నారు. పొలాలకు వెళ్లే రైతులు, కూలీలను విష సర్పాల బారిన పడకుండా వారిని అప్రమత్తం చేయాలని అధికారులకు సూచించారు. ఉభయగోదావరి, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల మత్స్యకారులు, ఇతర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆర్టీజీఎస్ సూచించింది.