మొన్నటివరకు ఈటల రాజేందర్ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా ఉండేది. కానీ ఊహించని విధంగా తెలంగాణ పీసీసీ అధ్యక్షుడుగా రేవంత్ రెడ్డి ఎంపిక కావడం ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ అయింది. ఊహించని విధంగా సీనియర్లని సైడ్ చేసి, రేవంత్ పీసీసీ దక్కించుకున్నారు. దీంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. కానీ కాంగ్రెస్‌లో ఉన్న కొందరు సీనియర్లు మాత్రం తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
ఇక మొన్నటివరకు పీసీసీ రేసులో ఉన్న నల్గొండ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే డైరక్ట్‌గా కాంగ్రెస్, రేవంత్‌లపై విమర్శలు చేశారు. ఓటుకు నోటు కేసు మాదిరిగానే నోటుకు పీసీసీ ఇచ్చారని ఆరోపించారు. అసలు తాను ఇంకా గాంధీ భవన్ మెట్లు తొక్కనని చెప్పేశారు. తాను సామాన్య కార్యకర్తగా ఉంటానని చెప్పి తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. తెలంగాణలో మరో టీడీపీ మాదిరిగా కాంగ్రెస్ తయారవుతుందని, హుజూరాబాద్ ఉపఎన్నికలో కాంగ్రెస్ డిపాజిట్ దక్కించుకుంటే గొప్పే అని మాట్లాడారు. ఈ మాటలు బట్టి చూస్తే కోమటిరెడ్డి సైతం కాంగ్రెస్‌కు ‘హ్యాండ్ ఇచ్చినట్లే అనిపిస్తోంది.
ఇంకా రేవంత్ ఎఫెక్ట్‌తో ఎంతమంది కాంగ్రెస్‌ని వీడతారనే చర్చ జరుగుతుంది. మొదట నుంచి రేవంత్‌ని విభేదిస్తున్న వి హనుమంతరావు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. అటు మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సిఎల్‌పి నాయకుడు భట్టి విక్రమార్కలతో పాటు కాంగ్రెస్‌లో ఉన్న సీనియర్ నాయకులు రేవంత్‌కు పీసీసీ ఇవ్వడంపై ఎలా స్పందిస్తారనేది చూడాలి. మొత్తానికైతే రేవత్ ఎఫెక్ట్ కాంగ్రెస్ సీనియర్లపై గట్టిగానే పడింది.