ఇటీవల కురిసిన భారీ వర్షాలకు హైదరాబాద్ నగరం మొత్తం అతలాకుతలం అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వరద బాధితులను ఆదుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం భారీగా నిధులు కూడా విడుదల చేసింది. వరద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పరిహారం అందేలా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేసింది. కానీ వరద సహాయం మొత్తం గులాబీ మయం అవుతుంది అని ప్రతిపక్షాలు మాత్రం తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి.
ఇటీవల ఇదే విషయంపై స్పందించిన తెలంగాణ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి బాధితులకు పరిహారం పంపిణీలో జరుగుతున్న అవకతవకలపై ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. నగరంలోని నిజమైన బాధితుల వివరాలను తాము తెచ్చామని వారందరికీ ప్రభుత్వం సహాయం చేయాలి అంటూ డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి. వరద బాధితులకు పరిహారం పంపిణీ విషయంలో జరుగుతున్న అవకతవకలపై ఫిర్యాదు చేద్దామంటే అధికారులు మాత్రం ఎందుకు అందుబాటులో లేరు అంటూ ప్రశ్నించారు.