రాష్ట్రీయ జనతాదళ్ పార్టీ అధ్యక్షుడు, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కేంద్రంలోని మోడీ సర్కారు గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం చాలా బలహీనంగా ఉన్నదని, ఆ ప్రభుత్వం ఏ క్షణమైనా కూలిపోవచ్చని ఆయన వ్యాఖ్యానించారు.
బలహీనమైన నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చే ఆగస్టు నెలలో కుప్పకూలవచ్చునని లాలూ యాదవ్ అనుమానం వ్యక్తంచేశారు. ఆగస్టులో మోదీ సర్కారు కూలిపోయే అవకాశం ఉన్నదని, కాబట్టి ఏ క్షణమైనా ఎన్నికలు రావచ్చని, ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. కాగా.. కేంద్రంలో ముచ్చటగా మూడోసారి నరేంద్రమోదీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే గత రెండు పర్యాయాల్లో బీజేపీకి ఫుల్ మెజారిటీ ఉండేది. ఈసారి బీజేపీకి సొంత మెజారిటీ దక్కలేదు. దాంతో మిత్రపక్షాలతో కలిసి మోదీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో బలహీన సంకీర్ణ సర్కారు ఏ క్షణమైనా కూలిపోతుందని లాలూ అంచనా వేశారు.