హైదరాబాద్‌లోని వీధి రోడ్లు ఒక్కసారిగా ఎర్రగా మారాయి. రోడ్లు ఎరుపు రంగులోకి మారడం ఏంటని స్థానికులు ఒక్కసారిగా షాకయ్యారు. స్థానికుల కథనం ప్రకారం జీడిమెట్ల పారిశ్రామికవాడను ఆనుకుని ఉన్న సుభాష్‌నగర్ డివిజన్ వెంకటాద్రి నగర్లో సోమవారం వీధుల్లోని రోడ్లు ఉన్నట్టండి ఎరుపు రంగులోకి మారాయి. రోడ్లపై ఎరుపు రంగులో నీర పారింది. ఆ నీళ్లను చూసిన జనం ఒక్కసారిగా అవాక్కయ్యారు.
ఆ నీరు ఎక్కడి నుంచి వస్తుందని స్థానికులు ఆరా తీయగా .. ఓ మ్యాన్‌హోల్ నుంచి ఉబికి వస్తున్నట్లుగా గుర్తించారు. వెంకటాద్రి నగర్‌లోని రెండు రోడ్లలో ఎరుపు నీరు ఏరులై పారింది. ఆ నీటి నుంచి వచ్చే దుర్గంధంతో స్థానికులు ఊపిరి తీసుకునేందుకు సైతం తీవ్ర ఉక్కిరిబిక్కిరయ్యారు. కొన్ని గోదాంల నిర్వాహకులు రసాయనాలను నేరుగా డ్రైనేజీలో కలిపేయడంతోనే ఈ పరిస్థితులు నెలకొన్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని కోరారు.