పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన ఇండియన్ బ్యాంక్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై ఆ బ్యాంక్ ఏటీఎంలలో వినియోగదారులకు రూ.2వేల నోట్లు లభించవు. రూ.2వేల నోట్లను తమ బ్యాంక్ ఏటీఎంలలో ఉంచబోమని ఆ బ్యాంక్ వెల్లడించింది. మార్చి 1వ తేదీ నుంచి ఈ నిర్ణయాన్ని అమలు చేయనున్నామని ఆ బ్యాంక్ తెలిపింది. దీంతో మార్చి 1వ తేదీ నుంచి దేశంలోని అన్ని ఇండియన్ బ్యాంక్ ఏటీఎంలలోనూ రూ.2వేల నోట్లు ఇకపై కనిపించవు.
అయితే ఇండియన్ బ్యాంక్ తాను తీసుకున్న ఈ నిర్ణయంపై స్పందిస్తూ… తమ బ్యాంక్‌కు చెందిన చాలా మంది కస్టమర్లు ఏటీఎంలలో రూ.2వేల నోట్లు తీసుకుని బ్యాంకుకు వచ్చి వాటిని ఎక్స్‌ఛేంజ్ చేసుకుని రూ.200 నోట్లు చిల్లర తీసుకుంటున్నారని, అందుకనే ఏటీఎంలలో ఇకపై రూ.2వేల నోట్లకు బదులుగా వీలైనన్ని ఎక్కువ రూ.200 నోట్లు పెట్టనున్నామని ఇండియన్ బ్యాంక్ ప్రతినిధులు తెలిపారు. ఇక మార్చి 1వ తేదీ వరకు తమ బ్యాంక్ ఏటీఎంలలో ఉండే రూ.2వేల నోట్లను అన్నింటినీ తీసేస్తామని వాటి స్థానంలో రూ.200 నోట్లను పెడతామని ఇండియన్ బ్యాంక్ వెల్లడించింది.
అయితే కస్టమర్లు బ్యాంక్ బ్రాంచ్‌లకు వెళ్లి రూ.2వేల నోట్లను యథావిధిగా తీసుకోవచ్చని ఇండియన్ బ్యాంక్ వెల్లడించింది. కానీ ఏటీఎంలలో మాత్రం ఇకపై ఆ నోట్లు కనిపించవని ఆ బ్యాంక్ తెలిపింది. అయితే ఇండియన్ బ్యాంక్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఇతర బ్యాంకులు కూడా పాటిస్తాయా, లేదా అన్నది వేచి చూస్తే తెలుస్తుంది..!