గంగానదిలో ఇకపై విగ్రహాలను నిమజ్జనం చేస్తే రూ.50 వేల ఫైన్..!

-

గంగానది పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై ఆ నదిలో ఎవరైనా సరే.. విగ్రహాలను నిమజ్జనం చేస్తే వారిపై ఏకంగా రూ.50వేల ఫైన్ విధించనున్నారు.

గంగానది పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై ఆ నదిలో ఎవరైనా సరే.. విగ్రహాలను నిమజ్జనం చేస్తే వారిపై ఏకంగా రూ.50వేల ఫైన్ విధించనున్నారు. ఈ మేరకు గంగానది పరివాహక ప్రాంతం ఉన్న రాష్ర్టాలకు కేంద్రం 15 సూచనలతో కూడిన ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో గంగానదితోపాటు దాని ఉపనదుల్లోనూ ఎవరూ ఇకపై విగ్రహాలను నిమజ్జనం చేయకూడదు.

నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా (ఎన్‌ఎంసీజీ) గంగా పరివాహక ప్రాంతం ఉన్న రాష్ర్టాలకు చెందిన 11 మంది ప్రభుత్వ అధికార ప్రతినిధులతో తాజాగా నిర్వహించిన సమావేశం అనంతరం ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు వెల్లడించింది. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గడ్, హర్యానా, రాజస్థాన్ రాష్ర్టాలకు చెందిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

కాగా వినాయక చవితి, దసరా పర్వదినాల సందర్భంగా భక్తులు ప్రతిష్టించే విగ్రహాలను నదుల్లో నిమజ్జనం చేస్తుండడం వల్ల నదులు కాలుష్యంతో నిండిపోతున్నాయని, ఈ క్రమంలో నదులను శుభ్రం చేయడం కష్టంగా మారిందని ఎన్‌ఎంసీజీ వెల్లడించింది. అందుకనే భక్తులు మట్టితో తయారు చేసిన విగ్రహాలను వాడాలని, వాటి అలంకరణలకు కేవలం సహజసిద్ధ రంగులనే వాడాలని, రసాయనాలను వాడకూడదని ఎన్‌ఎంసీజీ సూచించింది. అయితే విగ్రహాలను నిమజ్జనం చేసే సమయంలో తాత్కాలికంగా చిన్నపాటి కొలనులను ఏర్పాటు చేసుకుని వాటిల్లో కేవలం మట్టి విగ్రహాలనే నిమజ్జనం చేయాలని, దీంతో పర్యావరణాన్ని రక్షించుకోవడం సులభతరమవుతుందని ఎన్‌ఎంసీజీ అధికారులు రాష్ర్టాలకు సూచించారు..!

Read more RELATED
Recommended to you

Exit mobile version