ఉద్యోగాలను అమ్ముకున్నందుకు తెలంగాణ సంబరాలు జరుపుకోవాలా : ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌

-

మరోసారి సీఎం కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుక్రవారం బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం గన్‌పార్క్ అమరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీఎస్పీఎస్సీ పేపర్లు లీక్ చేసి కోట్ల రూపాయలకు ఉద్యోగాలను అమ్ముకున్నందుకు నిరుద్యోగులు తెలంగాణ సంబరాలు జరుపుకోవాలా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్రంలో 30 లక్షల నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టిన టీఎస్పీఎస్సీ చైర్మన్, సభ్యులు రాజీనామా కోసం వాళ్ళపై సీఎం ఎందుకు ఒత్తిడి తేవడం లేదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ఆదేశిస్తే ఒక్క నిమిషంలోనే టీఎస్పీఎస్సీ చైర్మన్ రాజీనామా చేస్తారని అన్నారు. పేపర్ల లీకేజీ సూత్రధారులు సీఎం కార్యాలయంలో ఉన్నారని ఆరోపించారు.

సిట్, ఈడీ విచారణ ఎదుర్కొంటున్న ప్రస్తుత టీఎస్పీఎస్సీ బోర్డుతోనే జూన్ 11న నిర్వహించే గ్రూప్ -1 పరీక్షను రద్దు ప్రభుత్వం చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే తెలంగాణ అగ్ని గుండం అవుతుందని హెచ్చరించారు. ప్రస్తుతం ఉన్న బోర్డుతో నిరుద్యోగులకు న్యాయం జరగదన్న ఆయన.. గ్రూప్ -1 పరీక్షను స్వచ్ఛందంగా నిరుద్యోగులు బహిష్కరించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ అమరవీరుల త్యాగాలు నెరవేర్చకుండానే రూ.105 కోట్ల ప్రజాధనంతో కేసీఆర్ సంబరాలు చేస్తున్నారని విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version