దేశీయ అతిపెద్ద వ్యాపార సంస్థ, ముఖేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ విలువ పరంగా రూ.20 లక్షల కోట్ల మార్కును అధిగమించిన మొట్టమొదటి ఇండియన్ కంపెనీగా నిలిచింది. దేశీయంగా చమురు నుంచి టెలికాం వరకు అనేక రంగాల్లో విస్తరించిన రిలయన్స్ సంస్థ షేర్ ఓ దశలో 2 శాతం పుంజుకుని రూ. 2,953ని తాకిడంతో ఆ సంస్థ మార్కెట్ విలువ రూ. 20 లక్షల కోట్ల మార్కును తాకింది.
రిలయన్స్ సంస్థ 2005లో మొదటిసారిగా రూ. లక్ష కోట్ల మార్కెట్ విలువను ,ఆ తర్వాత రెండేళ్లకు 2007లో రూ. 2 లక్షల కోట్లను, 2019 ఆఖరు నాటికి రూ. 10 లక్షల కోట్ల మార్కును అధిగమించింది. అనంతరం 2021 కల్లా రూ. 15 లక్షల కోట్లకు, ఇప్పుడు రెండు సంవత్సరాలు కూడా గడవకముందే రూ. 20 లక్షల కోట్లను దాటింది. ఇక, రిలయన్స్ తర్వాత రూ. 15 లక్షల కోట్లతో ఐటీ సేవల దిగ్గజం ఐటీసీ ఉండగా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ రూ. 10.5 లక్షల కోట్లు , ఐసీఐసీఐ బ్యాంక్ రూ. 7 లక్షల కోట్లతో అధిక మార్కెట్ విలువ కలిగిన కంపెనీలుగా ఉన్నాయి.