మంత్రి చొరవతో 60 ఏళ్ల సమస్యకు పరిష్కారం

-

రాష్ట్రాలు, దేశం ఎంత అభివృద్ధి చెందినా కొన్ని గ్రామాలు మాత్రం ఇంకా రవాణాకు నోచుకోవడం లేదు. అలాంటి గ్రామమే నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలోని సంస్థాన్ నారాయణపురం మండలంలోని పోర్లగడ్డ తండా. 60 ఏళ్లుగా ఈ గ్రామం ప్రభుత్వ రవాణా వ్యవస్థ లేక ఇబ్బందులు పడుతోంది. రాష్ట్ర మంత్రి సత్యవతి రాఠోడ్ చొరవతో ఎట్టకేలకు పోర్లగడ్డ తండాకు మొదటిసారి బస్సు వచ్చింది.

మునుగోడు ఉప ఎన్నికల్లో భాగంగా పోర్లగడ్డ తండాకు మంత్రి సత్యవతి ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. ఇందులో భాగంగా గడపగడపకు ప్రచారం నిర్వహించి అక్కడి గిరిజన ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నారు. తమ గ్రామానికి బస్సు లేక పడుతున్న ఇబ్బందుల గురించి ప్రజలు మంత్రికి వివరించారు.

స్పందించిన మంత్రి ఆర్టీసీ యాజమాన్యంతో మాట్లాడి తక్షణమే బస్సు వచ్చేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ఇబ్రహీంపట్నం నుంచి పోర్లగడ్డ తండా వరకు బస్సును ఏర్పాటు చేయించారు. మొదటి సారి తండాకు బస్సు రావడంతో గిరిజనులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 60 ఏళ్ల సమస్యను రెండు రోజుల్లోనే పరిష్కరించిన మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version