తెలుగు రాష్ట్రాల్లో సీతారాముల కళ్యాణం.. అంటే మొదటగా గుర్తువచ్చేది.. భద్రాచలం . భద్రాద్రిలో ప్రతి ఏటా సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవం జరగుతుంది. గత రెండు ఏళ్ల నుంచి కరోనా కారణంగా.. భక్తులు లేకుండానే సీతారాముల కళ్యాణాన్ని నిర్వహిస్తున్నారు. అయితే ఈ సారి కరోనా వ్యాప్తి తగ్గడంతో భక్తుల సమక్షంలో సీతారాముల కళ్యాణాన్ని నిర్వహించడానికి అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. భద్రాద్రిఆలో బ్రహ్మోత్సవాలు వచ్చే నెల 2 నుంచి ప్రారంభం కానున్నాయి.
ఏప్రిల్ 10న సీతారాముల కళ్యాణం జరగనుంది. ఏప్రిల్ 11వ తేదీన శ్రీ రామ పట్టాభిషేకం జరగనుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ రామయ్య భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది. రామయ్య కళ్యాణానికి భద్రాద్రికి రానివాళ్ల కోసం ప్రత్యేక ప్యాకేజ్ ను అమలు చేస్తున్నట్టు ప్రకటించింది. శ్రీ రామనవమి రోజున భద్రాద్రి సీతారాముల కళ్యాణంలో ఉపయోగించిన కోటి గోటి తలంబ్రాలను భక్తుల ఇంటికే పంపించడానికి సిద్ధం అయింది.
టీఎస్ ఆర్టీసీ కార్గో పార్సిల్ సర్వీస్ ల ద్వారా ఈ సౌకర్యం కల్పించాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ నిర్ణయం తీసుకున్నారు. టీఎస్ ఆర్టీసీ సర్వీస్ కేంద్రాల్లో రూ. 80 చెల్లించి తమ పేర్ల నమోదు చేసుకోవాలని సూచించారు. కళ్యాణం తర్వాత తలంబ్రాలు ఇంటికే వస్తాయని అన్నారు.