ఇది యుద్ధాల యుగం కాదంటూ ఇటీవల భారత ప్రధాని నరేంద్రమోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు సూచన చేశారు. దీనిపై తాజాగా రష్యా స్పందించింది. పశ్చిమ దేశాలు ఈ విషయాన్ని తమకు నచ్చినట్టుగా అన్వయించుకున్నాయని వ్యాఖ్యానించింది.
‘పశ్చిమ దేశాలు అసలు విషయాన్ని పక్కన పెట్టి, తమకు కావాల్సిన వాక్యాన్ని నచ్చినట్టుగా అన్వయించుకుంటాయి’ అని భారత్‌లో రష్యా రాయబారి డెనిస్ అలిపోవ్ అన్నారు. ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ చేసి ఎనిమిది నెలలు కావొస్తోంది. ఈ దాడికి ముగింపు ఇవ్వాలని ప్రపంచ దేశాలు కోరుతున్నాయి. ఈ క్రమంలో ఉజ్బెకిస్థాన్‌లోని సమర్‌ఖండ్‌లో షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) సదస్సుకు హాజరైన మోదీ.. అక్కడే పుతిన్‌తో విడిగా భేటీ అయ్యారు. ఆ సమయంలో పుతిన్‌తో మాట్లాడుతూ.. ప్రస్తుత యుగం యుద్ధాలది కాదని ఆయనకు సూచించారు. మోదీ సూచనను అమెరికా సహా పలు పశ్చిమ దేశాలు ప్రశంసిస్తున్నాయి. యుద్ధాన్ని ఆపే శక్తి మోదీకే ఉందంటూ వ్యాఖ్యానిస్తున్నాయి.